ఈ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేయబోతున్నాయా ?

Date:18/03/2019
బెంగళూరు ముచ్చట్లు:
కర్నాటకలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ పడుతున్న కాంగ్రెస్, జనతాదళ్(ఎస్) ఓట్ల బదలాయింపు ఛాలెంజ్ కానుంది. గత ఏడాది రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా నిలబడినా, అధికార పగ్గాలు చేపట్టకుండా కాంగ్రెస్, జేడీఎస్ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇపుడు లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేయబోతున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికివారుగా పోటీ చేసి ఓటర్లను ఆకర్షించుకోగా, ఇపుడు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల బదలాయింపు ఈ రెండు పార్టీలకు ఒక ఛాలెంజ్‌గా మారనుందని తెలుస్తోంది. ముఖ్యంగా పాత మైసూర్ రీజియన్‌లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు ఓట్ల బదలాయింపు కఠినంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రీజియన్‌లో ఈ ఉభయ పార్టీలు గత కొన్ని దశాబ్దాలుగా బద్ధవిరోధులుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇపుడు ఇదే ప్రాంతంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతుండడంతో ఓట్ల మార్పిడి ఎవరికి అనుకూలంగా ఉంటుందో అంతుపట్టడం లేదు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 20 స్థానాల్లో, జేడీఎస్ మిగిలిన 8 స్థానాల్లో పోటీ చేసేందుకు వీలుగా గతవారం సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాయి. కాంగ్రెస్, జేడీఎస్ కూటమిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి అత్యధిక సీట్లు దక్కకుండా చేసే దిశగా పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బద్ధ వ్యతిరేకులుగా పోటీ చేయడంతో ఆ ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉండొచ్చునని, ఓట్ల బదలాయింపు ప్రక్రియ అంత సులువు కాదని జేడీఎస్ సీనియర్ నాయకుడు వైఎస్‌వీ దత్తా అభిప్రాయపడ్డారు. ‘ముఖ్యంగా మైసూర్ రీజియన్‌లో ఈ ఉభయ పార్టీలు ఇప్పటికీ బద్ధ వ్యతిరేకులే. ఇక్కడ బీజేపీ ప్రభావం అంతగా లేదు. ఈ పరిస్థితుల్లో మేం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడతాం. ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు మా పార్టీ అభ్యర్థికి మద్దతు పలికితే మేము కూడా కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతాం. ఇది ఒకవిధంగా ఇబ్బందికరమే’ అని జేడీఎస్ సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు.
Tags:Are these two parties going to contest alliance?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *