ఆర్మీ ఆఫీసర్ హానీ ట్రాప్

Date:15/02/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఐఎస్ఐ హనీట్రాప్‌లో చికుకున్న లెఫ్టినెంట్ కల్నల్‌ను విధుల నుంచి తొలగించినట్లు వస్తోన్న వార్తల్లో నిజంలేదని సీనియర్ ఆర్మీ అధికారి కొట్టిపారేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ పరిధిలో విధులు నిర్వహించే లెఫ్టినెంట్ కల్నల్ ఐఎస్ఐ హనీట్రాప్‌లో చిక్కుకున్నరనేది కేవలం ఊహాజనిత ఆరోపణలు మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆయనపై ఆరోపణలు రావడంతో ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని ఓ బృందం విచారణ చేపట్టందని, అలాగే లెఫ్టినెంట్ కల్నల్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సోదాల్లో ఆర్మీ కౌంటర్ ఇంటెలిజెన్స్, మిలటరీ ఇంటెలిజెన్స్ వింగ్ కలిసి పాల్గొన్నారని ఆ అధికారి స్పష్టం చేశారు.హనీట్రాప్ ఆరోపణలతో అధికారిని తొలగించామనే వార్తలను కొట్టిపారేసిన ఆయన, డబ్బులకు ఆశపడి కీలక పత్రాలను శత్రుదేశానికి అందించారనే విషయంలో వాస్తవంలేదని అన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలియజేశారు. జబల్‌పూర్ లెఫ్టినెంట్ కల్నల్ రహస్యాలను బహిర్గతం చేశారనే అనుమానంతో ఫిబ్రవరి 12 న ప్రాథమిక విచారణకు ఆదేశించారు. ఇది ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా జరిగిందా అనేది నిర్ధరణకు రాలేదని తెలిపారు. ఆయన హనీట్రాప్‌లో చిక్కుకున్నట్లు, అవినీతికి పాల్పడినట్లు తమ విచారణలో ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని పేర్కొన్నారు. అంతేకాదు సున్నితమైన విషయాలను డబ్బుకు ఆశపడి ఇ-మెయిల్ ద్వారా పంపారనే వార్తల్లో నిజంలేదని ఖండించారు.అయితే ఆర్మీ సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో కొద్ది గంటలపాటు ప్రశ్నించి, తదుపరి విచారణ కోసం ఆయనను లక్నో‌కు తీసుకెళ్లారని, అతడి కార్యాలయంలో కీలకమైన పత్రాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాల అంటున్నాయి. వీటిని కూడా ఆర్మీ ధ్రువీకరించడం లేదు. అంతేకాదు సాధారణంగా జరిగే విచారణలో భాగంగానే ప్రశ్నించారు తప్ప, మరొకటి కాదని అన్నారు. యథాతథంగా ఆయన విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో కీలకమైన డిజిటల్ అధారాలను స్వాధీనం చేసుకుని, ఫోర్సెనిక్ ల్యాబ్‌కు పంపామని మాత్రం వెల్లడించారు. ఐఎస్ఐ హనీట్రాప్‌లో చిక్కుకుని, కీలక సమాచారాన్ని దయాదులకు అందజేసిన ఎయిర్‌ఫోర్స్ అధికారి అరుణ్ మార్వా ఘటన వెలుగుచూసి వారం తర్వాత మరో అధికారిపై ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హం.
Tags: Army Officer Honey Trap

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *