నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 14 రాష్ట్రాల నుండి కళాకారులు
– స్థానిక కోలాటం, భజన బృందాలకు ప్రాధాన్యం
– మీడియా సమావేశంలో టీటీడీ జెఈవో సదా భార్గవి
తిరుమల ముచ్చట్లు:

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 14 రాష్ట్రాల నుండి కళాకారులు విచ్చేసి వాహనసేవల్లో ప్రదర్శనలిచ్చేందుకు ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ జెఈవో సదా భార్గవి తెలిపారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజు ఆదివారం తిరుమల అన్నమయ్య భనవంలో జెఈవో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కళాప్రదర్శనలకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులు, స్థానిక భక్తులతోపాటు అమెరికా నుండి కూడా భక్తులు అభినందనలు తెలియజేశారని చెప్పారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింతగా భక్తులను ఆకట్టుకునేలా కళారూపాలను ఎంపిక చేశామన్నారు. కళాబృందాల ప్రదర్శన వీడియోలను ముందుగానే తెప్పించుకుని పరిశీలించి ఎంపిక చేసినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, పశ్చిమబెంగాళ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మణిపూర్ తదితర రాష్ట్రాల నుండి కళాబృందాలు వస్తున్నట్టు జెఈవో తెలిపారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యంతో పాటు జానపద నృత్యాలు, స్థానికులైన తిరుమలలోని బాలాజి నగర్, తిరుపతికి చెందిన పలు కళాబృందాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలియజేశారు.
బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఆంధ్రప్రదేశ్, రెండోరోజు కర్ణాటక, మూడోరోజు తమిళనాడు, నాలుగోరోజు తెలంగాణ, ఐదోరోజైన గరుడసేవనాడు అన్ని రాష్ట్రాల కళాబృందాలు, మిగతారోజుల్లో కొన్ని రాష్ట్రాలు కలిపి కళాప్రదర్శనలు ఉంటాయని జెఈవో వివరించారు. టీటీడీకి చెందిన ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ఉదయం, రాత్రి వాహనసేవల్లో సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు. వీరితోపాటు ఎస్వీ బాలమందిరం విద్యార్థులు కోలాటం, బర్డ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ల బృందం వేషధారణ ఉంటాయన్నారు. వాహనసేవలతోపాటు తిరుమలలోని ఆస్థానమండపం, నాదనీరాజనం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజగోపాల్, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, ఏఈవో శ్రీరాములు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణ శర్మ, అర్చక శిక్షణ కో-ఆర్డినేటర్ హేమంత్‌కుమార్ పాల్గొన్నారు.
Tags:Artistes from 14 states in Navratri Brahmotsavali
