భక్తులను ఆకట్టుకునేలా కళాబృందాలు 

Artists to impress devotees

Artists to impress devotees

Date:13/10/2018
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో  శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను ఆకట్టుకునేలా కళాబృందాలు ప్రదర్శనలు ఇస్తున్నాయని  హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి డా. రమణప్రసాద్ తెలిపారు.  తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్లో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు భక్తిభావాన్ని మరింత పెంచేలా తిరుమల, తిరుపతిలలోని వివిధ వేదికలపై ఆద్యాత్మిక, భక్తి, సంగీతం, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామన్నారు. తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం వేదిక, తిరుపతిలో మహతి, రామచంద్రపుష్కరిణి, అన్నమాచార్య కళామందిరం వేదికలపై భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు.
వాహనసేవల్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు నుండి చెక్క భజన, కోలాటం, అడుగుల భజన, పిల్లనగ్రోవి, గరగాట భజన, కీలుగుర్రాలు, కులుకు భజన, తప్పిటగుళ్ళు, బళ్ళారి డ్రమ్స్ తో భజనల బృందాలు ప్రదర్శనలు ఇస్తున్నాయని తెలిపారు. వివిధ దేవతామూర్తుల ప్రదర్శనలు, వెంకన్న గొడుగు భక్తులను అలరింపజేస్తున్నాయన్నారు. ప్రసిద్ద కళాకారులచే హరికథలు, భక్తి సంగీతం, పౌరాణిక నాటకాలు, యక్షగాన ప్రదర్శన, నృత్య సంగీతం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టామన్నారు.  తిరుమల నాలుగు మాడ వీధులలో ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన వేదికలపై వాహన సమయంలో నామసంకీర్తన చేస్తున్నారని చెప్పారు.
గుజరాత్ రాష్ట్రం నుంచి సాంప్రదాయ నృత్యం, ఛత్తీస్ ఘర్ నుండి పంతి డాన్స్, కర్నాటక నుండి పూజ కునిత, డొల్లు కునిత, చిలి పిలి గొంబె, యక్షగాన, సమన కునిత, కొంగేలు, తెలంగాణ నుండి ఒగ్గుడోలు, కొమ్ము కోయ, గుస్సాడి నృత్యం, కేరళ నుండి చెందన మేళం, హర్యాణ నుండి సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. టిటిడి విజిలెన్స్, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది చక్కటి సమన్వయంతో వాహన సేవల ముందు కళాబృందాలు ప్రదర్శనలు ఇస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా రాష్ట్రం నుండి ఆర్ట్ అండ్ కల్చలర్ అధికారులు డా. దీపిక, సుమన్ డాంగీ, హిర్డే కౌషాల్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్యాటక, సాంస్కృతిక విభాగం అధికారి శ్రీ ఎం. శంకర నారాయణన్ పాల్గొన్నారు.
Tags:Artists to impress devotees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *