రాయబరేలీ నుంచి అరుణ్ జైట్లీ

Arun Jaitley from Rai Bareilly

Arun Jaitley from Rai Bareilly

Date:05/11/2018

లక్నో ముచ్చట్లు:

రాయబరేలీ.. గాంధీల కుటుంబానికి పెట్టని కోట వంటి ఈ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఉత్తరప్రదేశ్ లోని ఈ లోక్ సభ స్థానం ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రాయబరేలి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది దివంగత నేత శ్రీమతి ఇందిరాగాంధీ. దశాబ్దాల పాటు ఆమె ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం
వహించారు. ఆమె తదనంతరం సమీప బంధువులు, తర్వాత ఆమె పెద్దకోడలు సోనియా గాంధీ చాలా కాలంగా ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు. యూపీఏ ఛైర్ పర్సన్ గా చక్రం తిప్పుతున్న సోనియాగాంధీ ఈ దఫా ఇక్కడి నుంచి పోటీ చేయరన్న ప్రచారం జరుగుతోంది. అనారోగ్య కారణాలు, వృద్ధాప్యం వల్ల క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించే ఆలోచనలో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కూతురు ప్రియాంక గాంధీని రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల ప్రియాంక గాంధీ వివిధ కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో ఆమె ఈ దఫా ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమన్న భావన బలపడుతోంది.అదే సమయంలో ఆమెను ఢీకొనేందుకు అధికార పార్టీ తరుపున కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే రాజ్యసభ సభ్యుడిగా ఎంపీ హోదాలో తనకు లభించిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను రాయబరేలీలో ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘకాలం నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ సరైన, సొంత నియోజకవర్గం లేక ఆయన ఇబ్బంది పడుతున్నారు. 2014 ఎన్నికల్లో పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి పోటీ చేసిన జైట్లీ ఘోరంగా ఓడిపోయారు. దేశవ్యాప్తంగా మోదీ గాలి వీచినప్పటికీ అమృత్ సర్ లోక్ సభ స్థానంలో ఆయనను కాంగ్రెస్ అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓడించారు. అమరీందర్ కు 4,82876 ఓట్లు రాగా, జైట్లీకి 3,80,106 ఓట్లే లభించాయి. అమరీందర్ ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడంతో జరిగిన ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ అభ్యర్థి గుర్జీత్ సింగ్ అవుజలా సుమారు రెండు లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గంపై జైట్లీ పూర్తిగా ఆశలు వదులుకున్నారు. అరుణ్ జైట్లీ ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎంపీ లాడ్స్ నిధులను రాయబరేలీకి మళ్లించడం ద్వారా అక్కడ పాగా వేసేందుకు జైట్లీ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో నియోజకవర్గంలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం ఎంపీ ల్యాడ్స్ నుంచి అయిదు కోట్ల రూపాయలు పనులు చేపట్టాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు సూచించే అధికారం ఉంది. 1993లో పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎంపీల్యాడ్స్ నిధులను రాయబరేలీలో వెచ్చించడం ద్వారా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం అయ్యే అవకాశముంది.

ఈ ప్రయత్నం పార్టీ శ్రేణుల్లో కదలిక తెస్తుంది.రాజకీయంగా చూస్త రాయబరేలీలో ప్రస్తుతం కాంగ్రెస్ అంత పటిష్టంగా లేదు. గత ఎన్నికల్లో సోనియా గాంధీ గెలుపు కూడా సమాజ్ వాదీ పార్టీ మద్దతుతోనే సాధ్యపడింది. అప్పట్లో ఆమెకు 5,26,434 ఓట్లు రాగా, సమీప బీఎస్పీ అభ్యర్థికి 1,73,721 ఓట్లు మాత్రమే వచ్చాయి. మెజారిటీ భారీగా కన్పిస్తున్నా సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో మాత్రమే సోనియా గట్టెక్కారన్నది చేదు నిజం. మొత్తం 80 లోక్ సభ నియోజకవర్గాల్లో రాయబరేలీ, అమేధీలోనే కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం. సమాజ్ వాదీ పార్టీ మద్దతు లేకుంటే హస్తం విజయావకాశాలు దెబ్బతినేవి. ఈ లోక్ సభ నియోజకవర్గంలో రాయబరేలి, సరేనీ, ఉంచ్ఛర్, బబ్రావన్, హర్ చంద్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో హస్తం పార్టీ అంతగా బలంగా లేదు. ఒక్క రాయబరేలీలోనే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అదితి సింగ్ విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి హబాజ్ ఖాన్ ను ఓడించారు ఆయన. 2017 అసెంబ్లీ ఎన్నికలలో సరేనీ స్థానాన్ని కమలం పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ధీరేంద్ర బహదూర్ సింగ్ బీఎస్పీ అభ్యర్థి ఠాకూర్ ప్రసాద్ యాదవ్ పై విజయం సాధించారు. ఉంచ్ఛర్ స్థానాన్ని సమాజ్ వాదీ పార్టీ చేజిక్కించుకుంది. ఎస్సీ రిజర్వ్ డ్ స్థానమైన బచ్రావన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రామ్ నరేశ్ రావత్ గెలుపొందారు. హర్ చంద్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్ సింగ్ విజయకేతనం ఎగురవేశారు. రాజకీయంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే కమలనికి అవకాశాలు బాగానే ఉన్నాయి. దీనికి తోడు నిధులు కేటాయింపు, క్షేత్రస్థాయి యంత్రాంగం బలోపేతం, తరచూ ముఖ్యనేతల పర్యటనల ద్వారా రాయబరేలీలో కాంగ్రెస్ ను దెబ్బతీయవచ్చన్నది కమలనాధుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.

35 ఏళ్ల వయస్సుకి మోహన్ లాల్

Tags:Arun Jaitley from Rai Bareilly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *