మాన‌సిక ఆందోళనలో అశోక్‌

Date:31/10/2020

విజ‌య‌న‌గ‌రం ముచ్చట్లు:

టీడీపీ ఆరంభం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు కు టీడీపీ అధినేత చంద్రబాబుకు మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరిగిందా ? ఆయ‌న‌ను చంద్రబాబు, బాబును ఆయ‌న ప‌ర‌స్పరం దూరం పెట్టుకున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు విజ‌య‌న‌గ‌రం పార్టీ నేత‌లు. ఇటీవ‌ల కాలంలో కుటుంబ వివాదాల‌తో అశోక్ త‌ల‌బొప్పి క‌ట్టింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ ప‌ద‌విని కోల్పోయారు. సింహాద్రి అప్పన్న ఆల‌య చైర్మన్ ప‌ద‌వినీ కోల్పోయారు. దీంతో ఆయ‌న తీవ్ర మాన‌సిక ఆందోళనలో ఉన్నారు. నాలుగు ద‌శాబ్దాలుగా ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నా.. ఆయ‌న అధికార ప‌క్షంలో ఉన్నా.. ప్రతిప‌క్షంలో ఉన్నా ఆయ‌న గౌర‌వానికి ఎప్పుడూ ఇబ్బంది రాలేదు.అయితే ఈ నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితంలో ఏనాడు ఎదుర్కొన‌న్ని అవ‌మానాలు అశోక్ ఈ ప్రభుత్వం వ‌చ్చిన యేడాదిన్నర కాలంలో ఎదుర్కొన్నారు. పార్టీ నుంచి మ‌ద్దతు ఉన్నా లేకున్నా ఈ విష‌యంలో ఆయ‌న పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా ఆయ‌నకు పార్టీలోనూ ప‌ద‌వి ల‌భించ‌లేదు. పైగా విజ‌య‌న‌గ‌రం పార్లమెంట‌రీ పార్టీ జిల్లా ఛీప్‌గా జూనియ‌ర్ అయిన కిమిడి నాగార్జున‌కు అప్పగించ‌డం… ఈ విష‌యంలో నిర్ణయం తీసుకునేముందు.. చంద్రబాబు క‌నీసం త‌న‌ను సంప్రతించ‌క‌పోవ‌డం వంటివి అశోక్‌ను తీవ్రంగా కుదిపేస్తున్నాయి.

 

 

వాస్తవానికి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలిగా తన కుమార్తె అదితి గజపతిరాజుని చూడాలని అశోక్ భావించారు. కానీ, ఆమెకు చంద్రబాబు ఎందులోనూ అవ‌కాశం ఇవ్వలేదు. త‌న కుమార్తెకు ఈ ప‌ద‌వి ఇవ్వక‌పోయినా తన అనుచ‌రుల‌కు అయినా ఈ ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్నారు. అయితే రాజ‌కీయంగా క‌ళా వెంక‌ట‌రావును సంతృప్తి ప‌రిచేందుకు ఆయ‌న కుటుంబానికి చెందిన నాగార్జున‌కు ఈ ప‌ద‌వి క‌ట్టబెట్టారు. పైగా జిల్లాల ప‌రంగా చూస్తే క‌ళా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు.2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి క‌ళా కుల రాజ‌కీయాలకు తెర‌లేపుతూ అశోక్‌ను ఇబ్బంది పెడుతున్నార‌న్న టాక్ టీడీపీ వ‌ర్గాల్లోనే గ‌ట్టిగా వినిపిస్తోంది. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు, క‌ళా క‌లిసే అశోక్ ప్రాధాన్యం త‌గ్గిస్తూ ఆయ‌న్ను రాజ‌కీయంగా సొంత పార్టీలోనే అణ‌గ‌దొక్కే ప్రయ‌త్నాలు చేశార‌ని అశోక్ వ‌ర్గం కుత‌కుత‌లాడిపోతోంది. ఇక ఇప్పుడు అశోక్‌ను నామ్‌కే వాస్తే చేయ‌డంతో ఆయ‌న పైకి చెప్పుకోలేక‌పోయినా లోలోన ర‌గిలిపోతున్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది.

 

 

ఈ కుటుంబం కూడా పార్టీలో తీవ్ర అవ‌మానం జ‌రిగింద‌నే భావ‌న‌కు వ‌చ్చింది. ఓ వైపు బీజేపీ నుంచి ఆఫ‌ర్లు గ‌ట్టిగానే ఉన్నా అశోక్ పార్టీనే న‌మ్ముకున్నా ఉప‌యోగం లేద‌ని ఆయ‌న అనుచ‌రులు భావిస్తున్నారు.ఇక‌, చంద్రబాబు వెర్షన్ కు వ‌స్తే.. గత ఏడాది ఎన్నిక‌ల్లో రెండు టికెట్లు ఇస్తే.. ఒక్కటి కూడా గెలుచుకోలేక పోయార‌నే ఆవేద‌న ఆయ‌న‌లో ఉంది. పైగా పార్టీలో స‌ఖ్యత లేకుండా పోయింద‌ని అంద‌రినీ క‌లుపుకొని వెళ్ల‌మ‌ని తాను ప‌దేప‌దే చెబుతున్న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బాబు భావిస్తున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే చంద్రబాబుకి, అశోక్‌కు మధ్య దూరం పూడ్చలేనంతగా పెరిగిపోయింది. తాజాగా తన కుమార్తెకు సైతం పదవి రాకపోవడంపై అశోక్‌ మరింత అసంతృప్తికి గురైనట్టు సమాచారం. పార్టీ నేతలెవరితోనూ మాట్లాడేందుకు సైతం ఇష్టపడడం లేదని ఆ పార్టీ జిల్లా నేతలే చెబుతున్నారు. ఇక‌, నిన్న మొన్నటి వ‌ర‌కు ప‌లు కార్యక్రమాల‌తో బిజీగా ఉన్న అదితి గ‌జ‌ప‌తి రాజు కూడా ఇప్పుడు ఎక్కడా క‌నిపించం లేదు. మొత్తానికి ఈ గ్యాప్ ఎప్పటి దాకా కొన‌సాగుతుందో ? చూడాలి.

మాస్కే కవచం

Tags: Ashok in mental anxiety

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *