అసెంబ్లీ రద్దు పిటీషన్లు కొట్టివేత

Assembly dismisses the dismissals

Assembly dismisses the dismissals

 Date:12/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైదరాబాద్ హైకోర్టు కొట్టేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ముందస్తు ఎన్నికలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ, శశాంక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు శుక్రవారం కొట్టేసింది. గడువు కంటే 9 నెలల ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజలకు నష్టం వాటిల్లుతుందంటూ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, సిద్దిపేటకు చెందిన న్యాయవాది పి. శశాంక్‌ రెడ్డి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇవే అభ్యంతరాలను వెలిబుచ్చుతూ సుప్రీంకోర్టులోనూ శశాంక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేకపోయినా, అత్యవసర పరిస్థితి లాంటివి లేకపోయినా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతోందని పిటిషనర్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉందని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలను రద్దు చేసి, గవర్నర్ పాలన విధించాలని కోరారు. తెలంగాణలో సాధారణ ఎన్నికల సమయానికి దాదాపు 20 లక్షల మందికి పైగా యువతకు ఓటు హక్కు పొందేందుకు వెసులుబాటు ఉందని, ముందస్తు ఎన్నికల వల్ల వారంతా ఓటు హక్కు వినియోగించుకోలేరని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసే విధంగా ఉందన్నారు. ‘ఎన్నికల సంఘంతో మాట్లాడిన తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. ఫలానా సమయంలో ఎన్నికలు జరుగుతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? దీన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి?’ అని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలోకి తీసుకుని సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు.
అప్పటివరకు రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించాలని, గవర్నర్‌ పాలన అమల్లో ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందని తెలిపారు. పిటిషన్ల వాదనలు విన్న హైకోర్టు వారు లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ పిటిషన్లను కొట్టేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు ఇటీవలే కొట్టేసిన విషయం తెలిసిందే. ఓటర్ల తుది జాబితాను విడుదల చేసేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం ఓటర్ల జాబితా విడుదల చేసింది.
Tags:Assembly dismisses the dismissals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *