విదేశీ పెట్టుబడులకు స్వరాష్ట్ర భరోసా

Date:15/09/2018
విజయవాడ ముచ్చట్లు :
రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐ, విదేశీ పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు భద్రత కల్పించే బాధ్యత ఏపీ పోలీసు శాఖ భుజానికెత్తుకుంది. విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి వైపు నడిపించడంలో కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా దేశీయ, విదేశీ, ప్రవాస భారతీయుల పెట్టుబడులకు సురక్షిత వాతావరణం కల్పించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ తమ లక్ష్యమని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు.
ఇందుకోసం దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా ఏపీ పెట్టుబడుల భద్రత, రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసు సీఐడీ విభాగానికి అనుసంధానంగా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ విభాగం రూపుదిద్దుకుంది. ఏపీ ఇనె్వస్ట్‌మెంట్ సెల్‌తో పాటు ఏపీ ప్రవాస భారతీయుల ఫిర్యాదుల పరిష్కార విభాగం కూడా నెలకొల్పారు.  విదేశాల్లో ఏపీకి చెందిన తెలుగువారు సుమారు 25 లక్షల మంది ఉన్నారని తెలిపారు.
ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతలు అదుపులో ఉంటే అభివృద్ధి సాధ్యపడుతుందని, దేశీయ, విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు వెనుకడుగు వేసే పరిస్థితి ఉండదన్నారు. అలాంటి వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందనడానికి సందేహమే లేదన్నారు.
అందువల్ల పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు ధైర్యంగా రాష్ట్రానికి వచ్చేందుకు అనుకూల వాతావరణం కల్పించడంలో పోలీసు శాఖ ప్రధాన పాత్ర వహిస్తోందన్నారు. దీనిలోభాగంగా సీఐడీ పర్యవేక్షణలో కొత్తగా విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రవాస భారతీయ, దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల సమస్యల సత్వర పరిష్కారం ద్వారా నమ్మకాన్ని కలిగించడం తమ ఉద్దశ్యమన్నారు.
ఏపీ డీజీపీ, ఇంటిలిజెన్స్ అదనపు డీజీ, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ, సీఐడీ అదనపు డీజీ వంటి ఉన్నతాధిరులు, సీనియర్ పోలీసు అధికారులతో కూడిన సలహా మండలి ఇందులో ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు.ఇతర ప్రభుత్వ అధికారులు, ఐటీ, ఫార్మా పరిశ్రమల ప్రతినిధులు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్ వాణిజ్య సమాఖ్య, తెలుగు ప్రవాస భారతీయ ప్రతినిధులు సలహా మండలిలో సభ్యులుగా ఉంటారని ఆయన వివరించారు.
ప్రభుత్వానికి, తెలుగుజాతికి, పోలీసుకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకురావాలనేదే లక్ష్యమని డీజీపీ ఠాకూర్ వివరించారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనూరాధ మాట్లాడుతూ కొత్త రాష్ట్రం అభివృద్ధికి విదేశాల్లో ఉన్న తెలుగువారు ముందడుగు వేస్తున్నారని, మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా పోలీసు శాఖ నడుం బిగించిందన్నారు. ఏపీ పెట్టుబడుల భద్రత, రక్షణ విభాగానికి సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు.
Tags:Assure of foreign investment for foreign investment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *