అడుగడుగునా నిర్లక్ష్యం 

Date:15/03/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖానాపూర్‌ చెరువు ట్యాంకుబండ్‌ పనులు అత్యంత నాసిరకంగా జరుపుతున్నారు. కళ్లముందే వాటి ఆనవాళ్లు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సక్రమంగా ఉపయోగించకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అందరూ ప్రేక్షకుల్లానే చూస్తున్నారు. ఇందులో పాలకులు, నేతలు, ప్రజలెవరూ అతీతులు కారని చెప్పొచ్చు.హైదరాబాద్‌ ట్యాంకుబండ్‌ మాదిరిగా ప్రతి నియోజక వర్గానికి ఒక చెరువు చొప్పున అభివృద్థి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిషన్‌ కాకతీయ రెండో విడతలో ఆదిలాబాద్‌ నియోజక వర్గానికి పట్టణానికి ఆనుకుని ఉన్న ఖానాపూర్‌ చెరువు ట్యాంక్‌ బండ్‌ పనులకు 2016-17లో రూ.4.83 కోట్లతో అంచనాలు తయారు చేశారు. వీటిలో నిర్మాణ పనులకు రూ.3.89కోట్లను కేటాయించింది. ఈ పనులను కాంట్రాక్టర్ 15.03 శాతానికి తక్కువగా కోడ్‌ చేసి రూ.3.31కోట్లకే పనులు పూర్తిచేస్తానని ముందుకొచ్చి పనులు దక్కించుకున్నారు. ఈ నిధుల ద్వారా కట్టల మరమ్మతులు, చుట్టూ సెంట్రల్‌ లైటింగ్‌, ఆవరణ అంతా అలంకరణ మొక్కలతో పచ్చదనం, క్యాంటీన్‌ సౌకర్యం, బోటింగ్‌ ఏర్పాటు, వాకింగ్‌ ట్రాక్‌ వంటి పనులు చేపట్లాలి.ఈ పనులు పట్టణంలోనే జరుగుతున్నాయి. అధికారులు, పాలకులు నిత్యం పర్యటిస్తుంటారు. ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమే. అయినా.. ఇక్కడి పనులను ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. కళ్లముందే నాసిరకం పనులు సాగుతున్నా.. అందరూ ప్రేక్షకుల్లానే వ్యవహరిస్తున్నారు. ఈ పనులను తనిఖీ చేయాల్సిన నాణ్యత పరిశీలన అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. దీంతో కాంట్రాక్టర్  ఇష్టారాజ్యంగా మారింది. కళ్లముందే నాసిరకం పనుల ఆనవాళ్లు బయటపడుతున్నా.. సంబందిత ఇంజినీర్‌ మాత్రం నాణ్యత ప్రమాణాల ప్రకారమే పనులు జరుగుతున్నాయని చెప్పడం పనితీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ నాసిరకమైన పనులపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించిన ఆర్‌టీఐ ఆక్ట్‌ అవర్నెస్‌ హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు జోగేందర్‌ సింగ్‌ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు.
 చెరువు కట్ట పటిష్టం చేయడానికి రూ.2.89 కోట్లు కేటాయించారు. వీటిని ఖర్చుచేయడంలో కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ట్యాంకుబండ్‌ పనుల్లో అత్యంత ముఖ్యమైంది కట్ట మరమ్మతులే. అయితే.. ఈ పనులు సైతం అత్యంత నాసిరకంగా సాగాయి. ఈ పనులకు వాస్తవానికి 7కి.మీ దూరంలో ఉన్న బంగారిగూడ నుంచి మొరం తీసుకురావాల్సి ఉంది. కానీ… చెరువులో మట్టినే తరలించి కట్ట నిర్మాణ పనులకు వాడారు. చెరువు మట్టికి జారుడు స్వభావం ఎక్కువే. ఈ మట్టిపైన చేసే నిర్మాణాలు ఎక్కువ కాలంపాటు నిలవవు. చెరువులో పేరుకపోయిన పూడికను తొలగించడానికి రూ.3.31లక్షలు కేటాయించారు. పూడిక మట్టినే కట్టకు వాడి .. బయట దూరం నుంచి మట్టితెచ్చిపోసినట్లుగా చూపించి రెండు రకాలైన పనులు చేసినట్లు రికార్డులు చూపారు. కట్టను లేయర్లు వేయాలి. దానిపైన రోలింగ్‌ సక్రమంగా తిప్పడంలేదు. దీంతో నిర్మాణంలో ఉండగానే గుంతలమయంగా తయారైంది.
Tags: At every step of the neglect

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *