కోమటిరెడ్డి వ్యవహారంపై అథిష్టానం సీరియస్

హైదరాబాద్  ముచ్చట్లు:


-కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగారు. కోమటిరెడ్డి ఆదివారం నిర్వహిచిన ప్రెస్ మీట్‌కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను ఠాగూర్ తెప్పించుకున్నట్లు సమాచారం. సోనియా గాంధీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని రాజగోపాల్ చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలతో పాటుగా గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ విషయంలో చేసిన కామెంట్లు, ప్రెస్ మీట్ల వీడియోలపై అధిష్టానం ఆరా తీస్తోంది. అంశాల వారీగా చేసిన కామెంట్స్, వాటిపై ఇచ్చుకున్న వివరణలపై దృష్టి సారించింది. గతంలో ఆర్సీ కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలపై చేసిన కామెంట్స్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో సహా ఇటీవల ఆయన మాటలపై పోస్ట్ మార్టం నిర్వహించే పనిలో పడినట్లుగా తెలుస్తోంది.కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మరోసారి ఫైర్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారంపై వీహెచ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏం అభివృద్ధి చేసిందని బీజేపీలో చేరుతారో తెలియడం లేదని అన్నారు. చివరకు పాలు, పెరుగులపై కూడా జీఎస్టీ వేశారని బీజేపీలోకి వెళుతున్నారా? అని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే అది ఆయన కుటుంబానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిగా మారుతుందని అన్నారు. తమ్ముడు పార్టీ మారుతుంటే అన్న వెంకట్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు?.. వెంటనే స్పందించిన తమ్ముడికి నచ్చ చెప్పుకోవాలని సూచించారు. సోనియా గాంధీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని రాజగోపాల్ రెడ్డి చెప్పడంపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

 

ఈడీ, సీబీఐలు మోడీ, అమిత్ షా చెప్పినట్లుగా నడుస్తున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలవడం ఏంటని ప్రశ్నించారు. రాజగోపాల్ ఓ నిర్ణయానికి వచ్చాడని, ఏం చేస్తాడో ఎవరికి తెలియడం లేదని వీహెచ్ అన్నారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనేది బీజేపీయే అన్న రాజగోపాల్ మాటలకు వీహెచ్ కౌంటర్ ఇచ్చారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ చచ్చిపోయిందని అంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఉన్నాయని చెబుతున్నారని బీజేపీలో తమకంటే ఎక్కువ తగాదాలు ఉన్నాయని అన్నారు. రాజగోపాల్ కూడా కాంగ్రెస్ పై పరోక్షంగా విమర్శలు చేయడంపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి రాజగోపాల్ రెడ్డి సీఎల్పీ లీడర్ పదవిని ఆశించారని, అలాగే టీపీసీసీ తనకే వస్తుందని భావించాడని అన్నారు. కానీ అలా జరగకపోవడంతో మనస్తాపం చెంది ఉంటారని అభిప్రాయపడ్డారు. బీజేపీలోకే ఎందుకు చేరుతున్నారనేది తనకు తెలియదని చెప్పిన వీహెచ్.. రాజగోపాల్ ఓ పెద్ద కాంట్రాక్టర్ అనే విషయం అందరికి తెలుసని చెప్పారు. మునుగోడు ప్రజలు చాలా మంది పార్టీ మారవద్దని చెబుతున్నా రాజగోపాల్ మాత్రం తొందరపడుతున్నాడని, వ్యక్తిగత ఎజెండా ఏమిటో తనకు తెలియదని అన్నారు. రాజగోపాల్ మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. ఈ విషయంలో హైకమాండ్ చూసుకుంటుందని వివరించారు.

 

Tags: Athisthanam is serious about the Komatireddy case

Leave A Reply

Your email address will not be published.