దారుణం..కోడలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్త..
కామారెడ్డి ముచ్చట్లు:
కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కోడలిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది అత్త. 4 నెలల గర్భిణీ అని చూడకుండా అత్త ఈ దారుణానికి ఒడిగట్టింది.కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట గ్రామానికి చెందిన బొడ్డు శంకర్ కుమార్తె కీర్తనను అదే గ్రామానికి చెందిన కురటి పండరితో 2021లో వివాహం చేశారు. పెళ్లైన మొదటి నుంచి కీర్తనకు వేధింపులు మొదలయ్యాయి. నిత్యం గోడలు జరుగుతుండేవి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. నిత్యం గొడవల కారణంగా, గ్రామస్థుల సూచనతో కీర్తన భర్తతో కలిసి హైదరాబాద్ పనికోసం వలస వెళ్లింది. పొలం పనులు ఉన్నాయని అత్త అంబవ్వ కీర్తనను ఇటీవల ఇంటికి పిలిపించింది. భార్యభర్తలు కీర్తన, పండరి అచ్చంపేటకు వచ్చారు. పండరి పొలం పనులకు వెళ్లగానే పథకం ప్రకారం కోడలు కీర్తనపై అత్త అంబవ్వ పెట్రోల్ పోసి నిప్పంటింది. బాధితురాలు తండ్రి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కురటి అంబవ్వను జుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు నిజాంసాగర్ ఎస్ఐ రాజు తెలిపారు.

Tags: Atrocious..Aunt poured petrol on Kodali and set it on fire..
