ముప్పేట మూషికాల దాడి

Attack of Thirteen Elements

Attack of Thirteen Elements

Date:26/11/2018
గుంటూరు ముచ్చట్లు:
వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, సాగునీటి కొరత ఏర్పడినప్పటికీ అష్టకష్టాలు పడి కృష్ణా పశ్చిమ డెల్టా అన్నదాతలు పండిస్తున్న వరిపై ఎలుకలు ముప్పేట దాడి చేస్తూ తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. నారుమడి నుంచి బిర్రు పొట్ట దశ వరకు పైరును తినేసి దిగుబడులు దారుణంగా పడిపోయేలా చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ చేపట్టిన సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం విజయవంతం కాకపోవడంతో అన్నదాతలు రూ.వేలు వెచ్చించినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. దాంతో అధికారులు సైతం చేతులెత్తేయగా రూ.వందల కోట్ల పంట నష్టం జరిగింది.
ఖరీఫ్‌లో జూన్‌, జులై, ఆగస్టు నెలల్లోనే సగటు వర్షపాతం నమోదైంది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో 30 నుంచి 60 శాతం లోటుంది. వేసవిని తలపిస్తూ ఎండలు మండిపోయాయి. అయినప్పటికీ డెల్టాలో 5.70 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. నెలలో నాలుగైదు రోజులు మాత్రమే వానలు కురిసి 25 రోజులు పొడి వాతావరణమే ఉండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎలుకల్లో సంతానోత్పత్తి పెరిగిపోయింది. ఒక్కోటీ మే నుంచి అక్టోబరు మధ్య ఎనిమిదిసార్లు పిల్లలను పెట్టగా వేల సంఖ్యలో పుట్టుకొచ్చినట్లైంది. అవి అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని నాట్లు వేసిన తర్వాత పైరును పిలక, చిగురు దశలో కొట్టేశాయి. ఈసారి సాగునీటి కొరత కారణంగా మడిలో సరిగా నీరు లేకపోవటంతో ఎక్కువ సమయం అక్కడే ఉండి పైరును తినేశాయి. ఒక్కో దానికి రూ.80 చెల్లించి పట్టించినా కొత్తవి వచ్చి దాడి చేస్తూనే ఉన్నాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన ఆగస్టు చివరి వారంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని చేపట్టారు.
సబ్‌ డివిజన్‌కు 375 నుంచి 450 కేజీల వరకు బ్రోమోడయోలిన్‌ మందు రాగా పంపిణీ చేశారు. మందులో కలపటానికి అవసరమైన నూకలకు అయ్యే ఖర్చును స్థానిక పంచాయతీలు భరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా సరిగా అమలు కాలేదు. దాంతో రైతులే ఎకరాకు కేజీ మందు కలిపేందుకు కావాల్సిన నూకల వ్యయాన్ని భరించారు. ఈ క్రమంలో ఆగస్టు చివరి వారం నాటికి మూడు లక్షల ఎకరాల్లో నాట్లు వేయగా వ్యవసాయ శాఖ కేవలం మూడు వేల ఎకరాలకు మాత్రమే బ్రోమోడయోలిన్‌ పంపిణీ చేసింది. దాంతో కొరత ఏర్పడగా రైతులు బయట దుకాణాల నుంచి గుళికలు కొనుగోలు చేసి ఎర పెట్టగా చచ్చేవి వందల సంఖ్యలో ఉంటే కొత్తగా పుట్టేవి వేలల్లో ఉండటంతో సమస్య పరిష్కారం కాలేదు.ఎలుకలను అరికట్టడం కోసం ఎకరాకు రూ.4 నుంచి 6 వేల వరకు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఒక్కో దానికి రూ.40 చొప్పున చెల్లించి బుటలు పెట్టించారు. అక్టోబరులో వానలు కురవకపోవటం, కాల్వల్లో నీరు అరకొరగా రావటంతో పొలంలో పెట్టిన నీరు పెట్టినట్లుగా ఇంకిపోయింది. దాంతో వరి మడులు పొడిగా ఉండటంతో చిగురు, చిరుపొట్ట దశలో దాడి చేసి పొలాన్ని తినేశాయి. డెల్టాలో లక్ష ఎకరాల్లో పైరు వీటి దాడి బారిన పడిందని అంచనా.
ఎలుకల దాడులవల్ల దిగుబడులు 20 నుంచి 35 శాతం తగ్గిపోనున్నాయి. వ్యవసాయాధికారులు సైతం ప్రతికూల వాతావరణ పరిస్థితులవల్లే ఈ నష్టం జరిగిందని, తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. కొరికేసిన పైరును చూసి అన్నదాతలకు కన్నీరే మిగిలింది. డెల్టాలో మొత్తం సుమారు రూ.150 కోట్ల పంట నష్టం సంభవించిందని అంచనా.
Tags:Attack of Thirteen Elements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *