కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై తెరాస నేతల దాడి

Date:11/01/2019
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేడి ఒక్కసారిగా వేడెక్కింది. గురువారం రాత్రి 2 గంటల సమయంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బీర్ల శంకర్ తమ్ముడి ఇంటిపై తెరాసకు చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేశారు. కర్రలతో ఇంటి తలుపులను బాదడంతో తలుపులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బాధితులు  వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు, దాడికి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి ప్రచారం ముగించుకుని ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 2 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంటి తలుపులను కర్రలతో దాడి చేశారని, తలుపుల శబ్ధం రావడంతో బయటకొచ్చి చూడగా, దాడి చేసినవారు తెరాసకు చెందిన మల్లేశ్, శివలింగం కనిపించారన్నారు. ఇంతరాత్రి ఎందుకు ఇంటి తలుపులు ఎందుకు బాదుతున్నారని అడగగా, అసభ్య పదజాలంతో దూషించారన్నారు. మేం ఎమ్మెల్యే మనుషులం, అధికారం మాది, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ తిట్టడంతో పోలీసులకు సమాచారమిచ్చామన్నారు. ఇంటిపై దాడిని ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని, వెంటనే వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు సర్పంచ్ అభ్యర్థి బీర్ల శంకర్. ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తకుండా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసులు ఘటనకు గల కారణాలపై నిందితులను విచారిస్తున్నామని, అర్ధరాత్రి ప్రత్యర్థి ఇంటిపై ఎందుకు దాడి చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Tags:Attack of TRS leaders on Congress leaders’ houses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *