తెలుగు నాడు నేతలపై దాడులు.. నెల్లూరులో ఉద్రిక్తత

Date:15/04/2019
నెల్లూరు  ముచ్చట్లు :
నెల్లూరు జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు తిరుమలనాయుడిపై దాడి ఘటన కలకలంరేపుతోంది. ఈ దాడికి నిరసనగా.. తిరుమలనాయుడి భార్య, తన కుమారుడితో కలిసి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. ఆమెకు మద్దతుగా టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు, టీడీపీ నేతలు భారీగా తరలివచ్చారు. ఇటు వైసీపీ నేతలు కూడా పోటీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. లాఠీఛార్జ్ చేసి ఇరుపార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టారు. మరోవైపు దాడి ఘటనపై కోటంరెడ్డి స్పందించారు. తిరుమలనాయుడికి చాలామందితో వ్యక్తిగతంగా కక్షలున్నాయని.. ఆ కోణంలో విచారణ చేయకుండా.. తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. టీడీపీ నేతలు అజీజ్, బీద రవిచంద్ర యాదవ్‌లు ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేశారని.. తన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో బీద రవిచంద్ర హస్తం ఉందన్నారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును అందరూ గౌరవించాలి.. బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. నెల్లూరు జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు తిరుమలనాయుడిపై ఆదివారం దాడి జరిగింది. కొందరు దుండగులు బైక్‌పై వెళుతున్న తిరుమలనాయుడ్ని కారులో వెంబడించారు. అతడి బైక్‌ను ఆపి.. కర్రలు, ఇనుప రాడ్లతో దారుణంగా చితకబాదారు. ఈ దాడిలో తిరుమలనాయుడు తలకు తీవ్ర గాయంకాగా.. స్థానికులు, టీడీపీ నేతలు ఆస్పత్రికి తరలించారు. తిరుమలనాయుడిపై నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడికి నిరసనగా.. కోటంరెడ్డి ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయలేదనే కారణంతో తిరుమలనాయుడిపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులు దాడి చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Tags:Attack on the leaders of Telugu Nadu .. Tension in Nellore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *