మెరుగైన సేవలను అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం

ఏపీఆర్టీసీ లోనూ స్లీపర్ బస్సులు
Date:12/01/2019
విజయవాడ ముచ్చట్లు:
ప్రైవేటు ఆపరేటర్ల పోటీని ఎదుర్కోవడంతోపాటు మెరుగైన సేవలను అందించి ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనన్ని ఎక్కువ ఏసీ సర్వీసులను నడిపేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్తగా వివిధ రకాల 84 ఏసీ బస్సులను కొనుగోలు చేసింది. వీటిలో ఇంద్ర 48, అమరావతి 4 బస్సులు ఉన్నాయి. అలాగే నైట్ రైడర్ పేరుతో 12 సిట్టింగ్ కమ్ స్లీపర్ బస్సులు, 20 స్లీపర్ బస్సులను సంస్థ కొనుగోలు చేసింది. వీటిలో10 ఏసీ స్లీపర్ బస్సులు ఇప్పటికే సంస్థకు చేరాయి. ఇందులో విజయవాడ రీజియన్‌కు 10 బస్సులు కేటాయించారు. విజయవాడ – హైదరాబాదు మార్గంలో 2, విజయవాడ – చెన్నై మార్గంలో 2, విజయవాడ – బెంగళూరు మార్గంలో 2 బస్సులను నడపనున్నారు. ప్రైవేటు ఆపరేటర్ల పోటీని తట్టుకునే విధంగా బస్సులను తయారు చేయించారు.
ఒక్కొక్క బస్సులో 30 సీట్ల సామర్థ్యంతో మెరుగైన సస్పెన్షన్‌తో గుంతలు ఉన్నా, గోతులు ఉన్నా ప్రయాణికులకు కుదుపు తెలియకుండా సౌకర్యవంతంగా ప్రయాణం సాగుతుంది. ప్రయాణికుల లగేజీ భద్రత కోసం విశాలమైన లగేజీ బూత్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇంద్ర, గరుడ, అమరావతి బస్సుల్లో ఉన్నట్టే ఇందులో కూడా వాటర్ బాటిల్స్  ఏర్పాటు చేశారు. కొత్త బెడ్ షీట్లు, కప్పుకునేందుకు రగ్గులు కూడా అందుబాటులో ఉంటాయి. 2+ 1 తరహా బెర్తులు ఉంటాయి. కార్గో పార్సిళ్లకు కూడా ఈ లగేజీ బూత్‌లు అనువుగా ఉండటంతో ఇటు ప్రయాణికులకు సౌకర్యంగా, అటు వాణిజ్యపరమైన రాబడికి అనుకూలంగా బస్సులు తయారయ్యాయి. ఎసీ సీటర్ + స్లీపర్ బస్సులకు సంబంధించి కొన్ని సీట్లు కూర్చోవడానికి, మరికొన్ని పడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బస్సులు మొత్తం 12 ఆర్టీసీ కొనుగోలు చేయగా అందులో 6 బస్సులలో 15 అప్పర్ బెర్త్‌లు + 33 సీట్లు ఉంటాయి. మిగిలిన 6 బస్సుల్లో 15 అప్పర్ బెర్త్‌లు + 5 లోయర్ బెర్త్‌లు + 22 సీట్లను ఏర్పాటు చేశారు.
Tags:Attempts to provide better services are intensifying

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *