అవధాన గని ‘నాగఫణి’శర్మ

శతావధానిఆముదాల మురళి

కడప ముచ్చట్లు:

 

అవధానంలో నూతనమైన ప్రయోగాలెన్నో చేసి అవధాన స్థాయిని ఖండఖం డాంతరాలకు వ్యాపింపజేసిన వన్నె తరగని అవధాన గని డా మాడుగుల నాగఫణి శర్మ అని ప్రసిద్ధ శతావధాని ఆముదాల మురళి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెలా సీమ సాహిత్యం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో 109వ సదస్సు నిర్వహింపబడిరది.
ఈ కార్యక్రమంలో ‘డా మాడుగుల నాగఫణి శర్మ అవధానాలు’ అనే అంశంపై ఆముదాల మురళి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో నాగఫణి శర్మ అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకొలను గ్రామంలో జన్మించారని అన్నారు. ఆయన తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో ‘కాళిదాసు కావ్యాల్లో ధర్మతత్వానుశీలనం’ అనే అంశంపై పరిశోధించి డాక్టరేట్‌ పట్టా పొందారని అన్నారు. మాడుగుల అవధానాల్లో ప్రధానంగా అనువాదం, నీ ప్రశ్నకు నాపాట, మధుర కంఠస్వరంతో ఆయన చేసే గానం వంటి కొత్త అంశాలు చోటుచేసుకొన్నాయని అన్నారు. మాడుగుల అవధానాలు కేవలం పౌరాణిక అంశాలకే పరిమితం కాకుండా అనేక సామాజిక అంశాలతో నిండి ఉండడం విశేషమని అన్నారు. ప్రస్తుత ప్రధాన సమస్య అయిన వరకట్నం గురించి ఆయన పాడిన ‘ఉద్యమించు ఉద్యమించు ఓ మహిళా, ఉత్క్రమించుఉత్క్రమించు మహిళా’ గేయం ఆయనకున్న సామాజిక స్పృహకు తార్కాణమని అన్నారు. ‘భరతుడెదిరించి రాముని భాగమడిగె’ అనే సమస్యను ఇవ్వగా ‘అకల కష్టాల కడలి నీకొకనికేన  సుఖసముద్రము దేలగా సఖులె అంత నన్ను మరచితి వేమి రామన్న యనుచు భరతుడెదిరించి రాముని భాగమడిగె’ అంటూ భరతుని వ్యక్తిత్వ విశిష్టతను పేర్కొంటూ గొప్పగా పూరించారని అన్నారు.

 

 

Post Midle

భారత పూర్వ ఉపరాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ ఆయన భవనంలో ఏర్పాటు చేసిన అవధానంలో చపాతి, పరోట, సాంబారు, కుర్మ అనే పదాలను ఇచ్చి సంస్కృత శ్లోకం చెప్పమంటే అప్పుడు నాగఫణి శర్మ ‘యశ్చపాతి జగత్సర్వం యోనుకంపాపరోటతి సాంబా రుద్ర తమాశ్రిత్య వయం కుర్మ నమశ్శతం’ అంటూ పరమశివుని గురించి అందంగా, అర్థవంతంగా పూరించారని అన్నారు. పద్యాలకు, అవధానాలకు కాలం చెల్లిందని ఒక పృచ్ఛకుడు అన్న మాటకు నాగఫణి శర్మ బదులిస్తూ ‘పద్యాలకు కాదు సుమీ, పద్యమ్ములు చెప్పలేనివారికి కాలం చెల్లింది’ అని గడుసుగా సమాధానమిచ్చారని అన్నారు. ఆయన అవధాన ప్రతిభను గుర్తించిన రసజ్ఞులు అవధాన సహస్రఫణి, బృహత్‌ ద్విసహస్రావధాని, శతావధాని సమ్రాట్‌, శతావధాన చూడామణి, కళాసాహిత్య కల్పద్రుమ వంటి బిరుదులతో సత్కరించారని అన్నారు.ఈ కార్యక్రమ ప్రారంభంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు డా మూల మల్లికార్జున రెడ్డి, సహాయ పరిశోధకులు డా భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డా చింతకుంట శివారెడ్డి, గ్రంథపాలకులు ఎన్‌.రమేశ్‌రావు, జూనియర్‌ అసిస్టెంట్‌ ఆర్‌.వెంకట రమణ, మౌనిక కలసి వక్త ఆముదాల మురళిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొండూరు జనార్దన రాజు, పుత్తా పుల్లారెడ్డి, మధుబాబు, కోటేశ్వరరావు, డా రాజగోపాల రెడ్డి, కొత్తపల్లె రామాంజనేయులు, ముడియం కిశోర్‌, బోగా చిన్నయ్య, బాలనాయుడు, దామోదరమ్మ పలువురు సాహితీవేత్తలు, పాఠకులు పాల్గొన్నారు.

 

Tags: Attention mine ‘Nagfani’ Sharma

Post Midle
Natyam ad