ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలకు అటానమస్ హోదా- పదేళ్లపాటు హోదా కల్పించిన యుజిసి
– అధ్యాపక బృందాన్ని అభినందించిన టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి ముచ్చట్లు:

టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 10 సంవత్సరాల పాటు అటానమస్(స్వయంప్రతిపత్తి) హోదా మంజూరు చేసింది. తద్వారా కళాశాల అభివృద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. విద్యావిధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్ సిలబస్ లో మార్పులు చేసుకోవడం వీలవుతుంది. దీంతోపాటు సామాజిక సేవా దృక్పథంతో విద్యా బోధన, ఆధునిక సాంకేతికత ఆధారంగా కోర్సుల నిర్వహణ, మెమరీ బేస్డ్ విద్యావిధానం ఏర్పాటుకు వెసులుబాటు కలుగుతుంది. ప్రాంగణ ఎంపికలకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తాయి.
1969వ సంవత్సరంలో ఏర్పాటు
1969వ సంవత్సరంలో ఏర్పాటైన ఈ కళాశాలలో నిపుణులైన అధ్యాపకులు విద్యాబోధన చేస్తున్నారు. మొత్తం 2,200 మంది విద్యార్థులు చదువుతుండగా, వీరిలో 1500 మందికి హాస్టల్ వసతి కూడా కల్పించడం జరిగింది. కళాశాలలో 19 విభాగాలు, 19 కోర్సులతో అధునాతన వసతులు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాల ఇటీవల తొలి ప్రయత్నంలోనే నాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించడం విశేషం.
ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు
ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీ ధనుంజయ రెడ్డి, ఐపీఎస్ అధికారి దామోదర్, టీటీడీ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ప్రజాసంబంధాల అధికారి డా.టి.రవి, కళాశాల ప్రస్తుత ప్రిన్సిపాల్ డా. వేణుగోపాల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా.చంద్రకేశవులు నాయుడు ఈ కళాశాలలోనే చదివారు.
ఛైర్మన్, ఈవో అభినందన
టీటీడీకి చెందిన శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలకు అటానమస్ హోదా లభించడానికి కృషి చేసిన టీటీడీ జెఈవో సదా భార్గవిని, విద్యాశాఖాధికారి డా. ఎం.భాస్కర్ రెడ్డిని, కళాశాల ప్రిన్సిపాల్ డా. వేణుగోపాల్ రెడ్డిని, కళాశాల అధ్యాపక బృందాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Tags: Autonomous status to SGS Arts College- UGC granted status for ten years
