Natyam ad

త్వరలో భక్తులకు అందుబాటులో గోవింద కోటి పుస్తకాలు – డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో ఎవి.ధర్మారెడ్డి

తిరుమల ముచ్చట్లు:

 

గోవిందకోటి పుస్తకాలను టీటీడీ ముద్రిస్తోందని, త్వరలో ఆన్లైన్ తో పాటు టీటీడీ కళ్యాణ మండపాలు, సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని టీటీడీ ఈవో   ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం శుక్రవారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

Post Midle

1. శ్రీనివాస్ – విశాఖ

ప్ర‌శ్న : పరకామణి సేవకులకు కూడా లక్కీ డిప్ లో ఆలయ డ్యూటీలు ఇవ్వండి

ఈవో: పరకామణి సేవ ముగిసిన తర్వాత ఆలయ విధులు కేటాయించేందుకు ప్రయత్నిస్తాం.

2. సూరిబాబు – హైదరాబాద్, బాలాజీ-వరంగల్, రామ్మోహన్- తాడేపల్లి

ప్ర‌శ్న : దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాం. అడ్వాన్స్ బుకింగ్ లో గది దొరకలేదు

ఈవో: తిరుమలలో 7 వేల గదులు మాత్రమే ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్ లో గదులు లభించని భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సిఆర్ఓలో నమోదు చేసుకుని కొంత సేపు వేచి ఉండి గదులు పొందవచ్చు. లేనిపక్షంలో తిరుపతిలో కూడా గదులు పొందే అవకాశం ఉంది.

3. వెంకటరమణ – నెల్లూరు

ప్ర‌శ్న : వైకుంఠ ఏకాదశి 10 రోజుల్లో లాకర్లు కూడా దొరకడం లేదు

ఈవో: వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల్లో భక్తులు ఎవరికి వారు ఆలోచించి 24 గంటల తర్వాత గదులను గానీ, లాకర్లను గానీ ఖాళీ చేసి ఇతర భక్తులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం.

4. చరణ్ – పల్నాడు, ఏలుస్వామి-అనంతపురం, సెల్వం తమిళనాడు.

ప్రశ్న : టికెట్ ఉన్న భక్తులనే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారా

ఈవో : వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం. ఇందుకోసం నవంబర్ 10న 2.25 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తాం. తిరుపతిలో 9 తొమ్మిది ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి 4.25 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచి జారీ చేస్తాం. శ్రీవాణి దాతలకు రోజుకు 2 వేల ఎస్ఇడి టికెట్లు జారీ చేస్తాం. దర్శన టికెట్లు లేని వారికి శ్రీవారి దర్శనం సాధ్యం కాదు. ఇలాంటి వారు తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పణ, స్వామివారి లడ్డూ ప్రసాదం పొందొచ్చు. దర్శన టికెట్లు లేకుండా భక్తులను అనుమతిస్తే కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉండి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కావున గత మూడేళ్లుగా అనుసరిస్తున్న విధానాన్ని ఈ ఏడాది కూడా అమలు చేస్తాం.

5. మోహన్ కృష్ణ – కడప

ప్రశ్న : గోవింద కోటి పుస్తకాలను టీటీడీ ముద్రించి నామమాత్రపు ధరకు అందించండి. శ్రీవారి ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను 90 రోజులు ముందు కాకుండా 30 రోజులు ముందు ఆన్లైన్లో విడుదల చేయండి

ఈవో : గోవింద కోటి పుస్తకాలను టీటీడీ ముద్రిస్తోంది. త్వరలో ఆన్లైన్ తో పాటు టీటీడీ కళ్యాణ మండపాలు, సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతాం. ఎక్కువ మంది భక్తుల కోరిక మేరకే మూడు నెలల ముందుగా ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు విడుదల చేస్తున్నాం.

6. రఘు – అనంతపురం

ప్రశ్న : మా ఊరిలో టీటీడీ కళ్యాణ మండపం పక్కనే ఉన్న స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించండి

ఈవో: స్థల పరిశీలన చేసి అవసరం ఉన్న పక్షంలో శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా శ్రీవారి ఆలయం నిర్మించేందుకు ప్రయత్నిస్తాం.

7. శంకర్ – హైదరాబాద్

ప్ర‌శ్న : నా వద్ద మూడు, నాలుగు డోనార్ రిసిప్టులున్నాయి. అన్నీ కలిపితే రూ.10 లక్షలు దాటుతుంది. ఆ మేరకు ప్రయోజనాలు వర్తిస్తాయా?

ఈవో : దాతలు విరాళం అందించిన తర్వాత ప్రయోజనాలు పొందకుండా ఉన్నట్లయితే రిసిప్టులను కలిపి ఒకే విరాళంగా పరిగణించి కొత్త ప్రయోజనాలు వర్తింప చేస్తాం.

8. అశ్వంత్ రెడ్డి – హైదరాబాద్

ప్రశ్న : ఎస్విబిసి ద్వారా ధార్మిక ప్రవచనాలు చాలా చక్కగా వింటున్నాం. వీటిని విద్యార్థులకు చేరువ చేయండి

ఈవో : భగవద్గీత సారాంశాన్ని విద్యార్థులకు అందించాలని ఇటీవల బోర్డు సమావేశంలో ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం 30 పేజీల్లో భగవద్గీత సారాంశాన్ని కోటి పుస్తకాలుగా ముద్రించి విద్యార్థులకు అందజేస్తాం. ప్రతి సంవత్సరం విద్యార్థులకు భగవద్గీత పై పోటీలు నిర్వహిస్తున్నాం. పురాణాలు, ఆర్ష వాంగ్మయంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం.

9. జ్ఞానప్రకాష్ – తిరుపతి

ప్రశ్న : తిరుపతి వాసులకు నెలకోసారి మంగళవారం నాడు దర్శనం ఇచ్చే విధానాన్ని పునరుద్ధరించండి

ఈవో : ఈ విషయాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాం.

10. భరత్ – ప్రకాశం

ప్రశ్న : మేము శేష వస్త్రానికి దరఖాస్తు చేస్తే ఇచ్చారు. నాణ్యత సరిగా లేదు

ఈవో : మీతో మాట్లాడి వివరాలు తీసుకుని తగిన చర్యలు తీసుకుంటాం.

11. ప్రసాద్ – మదనపల్లి

ప్రశ్న : 300 రూపాయలు దర్శనానికి వచ్చాము. కాలికి దెబ్బ తగిలినా బ్రిడ్జిపై ఎక్కించి ఎక్కువ దూరం నడిపించారు

ఈవో: భక్తులు స్లాట్ల ప్రకారం కాకుండా ముందుగానే వచ్చేస్తున్నారు. ఈ కారణంగా ఎక్కువ క్యూ లైన్లు ఏర్పాటు చేయాల్సి వస్తోంది.

12. నిహారిక – కృష్ణాజిల్లా

ప్రశ్న : దాతలు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఈవో: దాతలు పది రోజుల్లో ఏదోఒకరోజు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

13. బాలాజీ – చెన్నై

ప్రశ్న: మా తల్లి గారు ఫ్యామిలీ పెన్షనర్. టీటీడీ బ్రహ్మోత్సవ లడ్డు, వడ ప్రసాదం చెన్నైలో తీసుకోవచ్చా.
ఈవో: మీకు బ్రహ్మోత్సవాల లడ్డు, వడ ప్రసాదం అందే ఏర్పాట్లు చేస్తాం.

14. అప్పన్న – విశాఖ
ప్రశ్న: వయోవృద్ధులకు ప్రత్యేకంగా గదులు కేటాయించండి. తిరుపతి అభివృద్ధికి టీటీడీ బడ్జెట్లో ఒక శాతం నిధులు కేటాయించాలని భావించడం సమంజసమేనా?
ఈవో : వయోవృద్ధులు, దివ్యాంగులు ఆన్లైన్లో దర్శన టోకెన్లు పొందుతున్నారు. అదే విధంగా గదులు కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి కూడా కలిసి ఉంది. ఇక్కడ టిటిడి స్థానిక ఆలయాలతో పాటు టీటీడీకి చెందిన అనేక భవనాలు, విశ్రాంతి సముదాయాలు, సంస్థలు ఉన్నాయి. వీటికి టీటీడీ ఆస్తి పన్ను చెల్లించడం లేదు. టీటీడీలో పనిచేస్తున్న 23 వేల మంది ఉద్యోగులు వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. కావున మెరుగైన పారిశుద్ధ్యంతోపాటు ఇతర మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది. అయితే ప్రభుత్వ నిర్ణయం మేరకు తిరుపతి అభివృద్ధిని కార్పొరేషన్ చేపడుతోంది.

15. శేఖర్ – ఆదోని, శ్రీనివాస్ – హైదరాబాద్.
ప్రశ్న : తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టాక్సీల నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో విఐపిలకు ఇతర సామాన్య భక్తులకు వేరువేరు పాయింట్ల నుంచి కాకుండా ఒకే పాయింట్ నుంచి స్వామివారి దర్శనం కల్పించండి

ఈవో : తిరుమలలో చాలా సంవత్సరాలుగా స్థానికులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టాక్సీల చార్జీలను నియంత్రణకు ప్రయత్నిస్తాం. శ్రీవారి ఆలయంలో 1980 ప్రాంతంలో కులశేఖరపడి వరకు భక్తులు వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు. ఆ తర్వాత క్రమంగా రోజుకు 35,000 మంది దర్శనానికి వచ్చేటప్పటికి కొలువు మండపం వరకు వెళ్లేవారు. 2006వ సంవత్సరం తర్వాత భక్తుల సంఖ్య 70 వేల నుంచి 80 వేలకు పెరిగింది. అప్పటినుంచి జయవిజయుల వద్ద నుంచి మహాలఘు దర్శనం అమలు చేస్తున్నారు. వీఐపీలకు మూడు గంటలు మాత్రమే నిబంధనల ప్రకారం దర్శనం కల్పిస్తున్నాం. ఈ వ్యవస్థ అన్ని ఆలయాల్లోనే ఉంది.

 

Tags: AV Dharma Reddy in Dial Your Evo

Post Midle