సమస్యలను పారదోలండి

Date:08/11/2018
నిర్మల్ ముచ్చట్లు:
రిమ్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసుల వైద్య అవసరాలకు పెద్దదిక్కు. నాలుగు జిల్లాలకు చెందినవారు వైద్యసేవల కోసం అధికంగా ఇక్కడికే వస్తుంటారు. ప్రధానంగా బడుగులు రిమ్స్ నే ఆశ్రయిస్తుంటారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్న సర్కార్ ఇప్పటికే ఈ ఆసుపత్రిని పటిష్టం చేసేందుకు పలు చర్యలు తీసుకుంది. అధునాత పరికరాలు అందుబాటులో ఉంచింది. ఇక ఆసుపత్రి వర్గాలు కూడా ఎంసీఐ గుర్తింపు కోసం తగిన ఏర్పాట్లు చేశారు. అయితే ఇన్ని అభివృద్ధి చర్యలు తీసుకున్నా కొన్ని సమస్యలు మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని పలువురు అంటున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల ఆసుపత్రికి వచ్చేవారికి సమర్ధవంతమైన వైద్య సేవలు అందడంలేదని అంటున్నారు. సిబ్బంది కొరతకు తోడు.. ఇన్ పేషెంట్లు ఉండడానికి పడకలు కూడా తగినన్ని లేవన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఉమ్మడిజిల్లాలో ప్రధాన ఆసుపత్రి రిమ్స్. ఇక్కడ సమస్యలు పరిష్కరించి సౌకర్యాలు పెంచాలని ప్రజలు చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్నిసందర్భాల్లో ఆందోళనలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే సమస్యలను పూర్తిగా పరిష్కరించడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారన్న కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలాఉంటే రిమ్స్ లో పనిచేస్తున్న కొందరు వైద్యులకు సొంతంగా ఆసుపత్రులు ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
ఇలాంటివారు బాధితులకు సరైన వైద్యం చేయడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారీ దవాఖానాలో సరైన వైద్యం లభించక పలువురు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు కొత్త సిబ్బంది వస్తున్నా వారు ఎంతో కాలం పనిచేయలేకపోతున్న పరిస్థితులు ఉంటున్నాయి.
సీనియర్లు లేనిపోని మాటలు చెప్తుండడం వల్లే కొత్తవారు ఇక్కడ పనిచేసేందుకు ఆశక్తి చూపడంలేదన్న విమర్శలున్నాయి. ఏదేమైనా రిమ్స్ లో తిష్ట వేసిన సమస్యలను సత్వరమే పరిష్కరించి.. సమర్ధవంతమైన వైద్యసేవలు అందించే కేంద్రంగా తీర్చిదిద్దాలని అంతా కోరుతున్నారు.
Tags: Avoid problems

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *