ఇవాళ్టి నుంచి ఆయుష్మాన్ భారత్

Ayushmann Bharat from this

Ayushmann Bharat from this

Date:14/08/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రకటించనున్నారు. ‘ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్  పేరుతో ప్రారంభమయ్యే ఈ పథకం సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పేద ప్రజలకు ఆరోగ్య సంరక్షణే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద ఎంపిక చేసిన ప్రతి కుటుంబానికి వార్షికంగా రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు.
దీనిద్వారా సుమారు పదికోట్ల కుటుంబాలకు (40 – 50 కోట్ల మందికి) లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద ప్రజలకు వరంగా చెప్పవచ్చు. వీరితో పాటు పట్టణ ప్రాంతాల్లోని కూలీలను కూడా లబ్ధిదారులుగా పరిగణిస్తారు. 8.03 కోట్ల గ్రామీణ, 2.33 కోట్ల పట్టణ పేదలకు ఈ బీమా సౌకర్యాన్ని అందించనున్నారు. మొదట ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా కొన్ని రాష్ట్రాల్లో ప్రకటించనున్నారు. తర్వాత దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
మొదట పంజాబ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, డిల్లీలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు. ఈ పథకంలో మొత్తం 21 రకాల వ్యాధులను చేర్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో `నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్`(ఆయుష్మాన్ భారత్)కు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కోసం కేంద్రం బడ్జెట్‌లో రూ.10,000 కోట్లు కేటాయించింది.
కేవలం ప్రభుత్వ సెక్టార్‌తోనే 50 కోట్ల మందికి సేవలందించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం.. అందుకోసం ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంతో ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించనుంది. ఈ పథకంలో భాగస్వాములయ్యేందుకు బీమా సంస్థల ఎంపిక కూడా పూర్తవడంతో.. ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
ఈ మేరకు ఎర్రకోట నుంచి మోదీ పథకాన్ని ప్రకటించనున్నారు. కేంద్ర ప్రతిపాదిత ఐదు లక్షల ఆరోగ్య భీమాకు 1,082 రూపాయలను కేంద్రం ప్రీమియంగా నిర్ణయించింది. అయితే ఏ భీమా కంపెనీ ఈ ప్రీమియంకు ఒప్పుకోదని, ప్రీమియంగా ఇంతకన్నా 63 శాతం ఎక్కువగా అంటే, 1,765 రూపాయలను చెల్లించాల్సి వస్తుందని ‘క్రిసిల్‌’ ఓ నివేదికలో వెల్లడించింది.
ఇప్పటికే జాతీయ ఆరోగ్య భద్రతా పథకంలో కేంద్రం 60 శాతం భరిస్తుండగా, రాష్ట్రాలు 40 శాతం నిధులను భరించాలన్నది తెల్సిందే. ఈ అదనపు ప్రీమియం కూడా రాష్ట్రాలే భరించాల్సి రావచ్చు. కేరళలో 41 లక్షల మంది పేదలకు ప్రస్తుతం ఆరోగ్య భీమాను అమలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కీమ్‌లో అక్కడ 22 లక్షల మంది పేదలకు మాత్రమే ఈ స్కీమ్‌ను అమలు చేయాలని సీలింగ్‌ పెట్టారు. ఈ లెక్కన అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న 41 లక్షల మందికి కొత్త పథకాన్ని అమలు చేయాలంటే 19 లక్షల మందికి స్వయంగా ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది.
25 కోట్లకుగాను, 3.6 కోట్ల మందికేకేంద్రం ఇప్పటికే అమలు చేస్తున్న ‘రాష్ట్రీయ స్వస్థత భీమా యోజన’ను దేశవ్యాప్తంగా 25 కోట్ల మందికి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 3.6 కోట్ల మందికి మాత్రమే అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికే కాకుండా రోజువారి దినసరి కూలీలు, ఇంటి పనివాళ్లు, భవన నిర్మాణ కూలీలు, వీధుల్లో వ్యాపారం చేసుకునేవారు, రైల్వే పోర్టర్లు, బీడి కార్మికులు, పారిశుద్ధ పనివాళ్లు, రిక్షా కార్మికులు….ఇలా అసంఘటిత రంగానికి చెందిన ప్రతి ఒక్కరు అర్హులైనప్పటికీ 3.6 కోట్ల మందికి మించి అమలు జరగడం లేదు.
ఇప్పుడు దారిద్య్ర రేఖకు దిగువనున్న పది కోట్ల మందికి మాత్రమే అమలు చేయాలనుకుంటున్న కొత్త ఆరోగ్యం పథకం రెండు కోట్ల మందికి దాటటం కూడా మహా ఎక్కువన్నది నిపుణుల అంచనా.
కార్పొరేట్‌ ఆస్పత్రలు కోసమేఉత్తరాదిలో కార్పొరేట్‌ వైద్యం అంతగా విస్తరించలేదు. అక్కడ ఆరోగ్య భీమా పథకాలు అంతంత మాత్రమవడం కూడా ఒక కారణం. ఇటు దక్షిణాదిలో కార్పొరేట్‌ ఆస్పత్రులు విస్తరించినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు అవి ఇప్పటికీ దూరంగా ఉన్నాయి. కార్పొరేట్‌ వైద్యం ఖరీదవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అవి నిలదొక్కుకోలేక పోతున్నాయి.
ఇప్పుడు కేంద్రం ప్రవేశ పెట్టిన ఐదు లక్షల భద్రతా పథకం వల్ల కార్పొరేట్‌ ఆస్పత్రులు గ్రామీణ ప్రాంతాలకు దూసుకుపోతాయని, అందుకోసమే మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకొస్తున్నదని బెంగళూరులోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సహ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ ఎన్‌. దేవదాసన్‌ లాంటి వాళ్లు విమర్శిస్తున్నారు.మూడు లక్షలు చాలుతమిళనాడులో ఏటా 72 వేల రూపాయలకన్నా తక్కువ ఆదాయం కలిగిన పేద ప్రజల కోసం రెండు రకాల ఆరోగ్య భీమా పథాన్ని అమలు చేస్తున్నారు.
1205 రకాల వైద్యానికి లక్ష రూపాయలు, 254 రకాల వైద్యానికి రెండు లక్షల రూపాయలను అమలు చేస్తున్నారు. 2009 నుంచి ఈ పథకం సవ్యంగా అమలు జరుగుతున్నది. మహారాష్ట్రలో ఒకటిన్నర లక్షల రూపాయను, రాజస్థాన్‌లో మైనర్‌ వైద్యానికి 30 వేల రూపాయలను మేజర్‌ వైద్యానికి మూడు లక్షల రూపాయలను బీమాను అమలు చేస్తున్నారు. ఈ లెక్కన మోదీ ప్రారంభిస్తున్న జాతీయ ఆరోగ్య భీమా స్కీమ్‌ కింద మూడు లక్షల రూపాయల భీమాను కల్పిస్తే సరిపోతుందని జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్శిటీలోని ‘స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ’ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఇంద్రానిల్‌ ముఖోపాధ్యాయ్‌ అభిప్రాయపడ్డారు.క్యాన్సర్, గుండె, కిడ్నీల మార్పిడి లాంటి శస్త్ర చికిత్సలకే ఐదు లక్షల రూపాయలకు మించి ఖర్చు అవుతుంది. మిగితా జబ్బులన్నింటికి మూడు లక్షల కవరేజ్‌తోని వైద్యం చేయవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఎక్కువ ఖర్చయ్యే వైద్యం కోసం ఎక్కువ కవరేజీ, తక్కువ ఖర్చయ్యే వాటికి తక్కువ కవరేజ్‌తో భీమా పథకాలను అమలు చేయడం ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ కవరేజీ వల్ల కార్పొరేట్‌ ఆస్పత్రులు లాభ పడడమే కాకుండా అనవసరమైన పరీక్షలు, చికిత్సలు చేస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ ‘రాష్ట్రీయ స్వస్థత భీమా యోజన’ కింద 2011లో బీహార్‌లో 700 మంది మహిళలకు అనవసరంగా కార్పొరేట్‌ ఆస్పత్రులు  శస్త్ర చికిత్సలు చేసి గర్భసంచులు తొలగించారు. ఇలాంటి కేసులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, చత్తీస్‌గ«ఢ్‌లలోనూ వెలుగు చూశాయి. 1996 నుంచి 2014 మధ్య కార్పొరేట్‌ వైద్యం మరీ ఖరీదై పోయిందని ఓ ఆధ్యయనం తెలియజేయగా, ఏటా ఎనిమిది శాతం మంది మధ్య తరగతి ప్రజలు వైద్యం కారణంగా పేదవారుగా మారిపోతున్నారని మరో అధ్యయనం వెల్లడించింది.
Tags:Ayushmann Bharat from this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *