బాబు అడ్డాకు జగన్

తిరుపతి ముచ్చట్లు:


ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 22న కుప్పంలో పర్యటించనున్నారు. జగన్ తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో కాలుమోపుతున్నారు. గత ఎన్నికల ప్రచారంలోనూ ఆయన కుప్పంలో పర్యటించలేదు. ఆయన పాదయాత్ర కుప్పం మీద నుంచి సాగకపోవడమే ఇందుకు కారణం. అయితే తొలిసారి పర్యటనకు వెళుతున్న జగన్ కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు, జనసమీకరణ చేసేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. కుప్పంలో జగన్ పర్యటనను ఫుల్లు సక్సెస్ చేసి చంద్రబాబుకు నిద్రపట్టకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. నిజానికి ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా పాల్గొనాల్సి ఉంటుంది.

 

 

 

ప్రభుత్వం నుంచి ఆహ్వానం కూడా పంపాల్సి ఉంటుంది. జగన్ కుప్పం మున్సిపాలిటీలో 66 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో కూడా పాల్గొంటారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా జగన్ కుప్పం పర్యటనలో చంద్రబాబు పాల్గొంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటారనే అనుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీలోకే అడుగుపెట్టనని శపథం చేసిన చంద్రబాబు జగన్ పాల్గొనే సభకు ఆయన హాజరవుతారని అనుకోలేం.అయితే కొద్దికాలం క్రితం చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పెద్దయెత్తున ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనలోనూ ఉద్రిక్తత తలెత్తేే అవకాశముందని ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

 

 

 

 

దీంతో జిల్లా పోలీసులు ముఖ్యమంత్రి పర్యటనకు ముందుగానే టీడీపీలో ముఖ్యమైన కార్యకర్తలను అదుపులోకి తీసుకునే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పం నియోజకవర్గాన్ని గెలుచుకోవాలన్న లక్ష్యంతో జగన్ కుప్పంలో పర్యటిస్తున్నారు.జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు అనేక సార్లు చంద్రబాబు వెళ్లారు కాని, కుప్పానికి మాత్రం జగన్ వెళ్లలేదు. తొలిసారి వెళుతుండటంతో నియోజకవర్గానికి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశముందంటున్నారు. జగన్ చేసే ప్రకటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే జగన్ కుప్పం పర్యటనను ఎంచుకున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పులివెందులలో తాము కూడా మినీమహానాడు పెడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుప్పంలో జగన్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. టీడీపీ కూడా జగన్ పర్యటనలో నల్లజెండాలను ప్రదర్శించాలని సిద్ధమవుతుందన్న సమాచారంతో ఇటు పోలీసులు, అటు పార్టీ వర్గాలు అప్రమత్తమయ్యారు. మరి ఏంజరుగుతుందన్న టెన్షన్ కుప్పంలో నెలకొంది.

 

Tags: Babu Addaku Jagan

Leave A Reply

Your email address will not be published.