పీయూష్ గోయల్ పై బాబు ఫైర్

Date:14/03/2018
విజయవాడ ముచ్చట్లు:
టీడీపీ ఎంపీలకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. మిత్రపక్షాలకు చెందిన వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వైకాపా ఎంపీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన బాబు, ఎవరిని అవమానిస్తున్నారంటూ బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మిత్రపక్షం వైకాపానా? టీడీపానా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోందని, లాలూచీ పడేవాళ్లు ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోతారని చురకలంటిచారు. తమకు హైకమాండ్ ప్రజలేనని, వారి ఆకాంక్షలే మనకు ముఖ్యమని నేతలకు సూచించారు. బుధవారం టీడీపీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. ఏపీ పునర్వవస్థీకరణ చట్టంతోపాటు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల అమలు తీరును సమీక్షించాలని సీఎం పేర్కొన్నారు. ఏపీ సమస్యలపై కేంద్రం స్పందించకపోవడం అన్యాయమని, కేంద్రం వైఖరి రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు వదిలిపెట్టేది లేదని ఇక్కడ శాసనసభ, శాసన మండలితోపాటు అక్కడ లోక్‌సభ, రాజ్యసభల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ సమస్యలే ప్రతిధ్వనించాలని ఉద్ఘాటించారు. పార్లమెంటు జరిగేటప్పుడు ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని తర్వాత రాష్ట్రం, జిల్లా స్థాయిలో దీన్ని కొనసాగించాలని సూచించారు. ఆర్ధిక బిల్లులను హడావుడిగా పూర్తిచేసి పార్లమెంటు నిరవధిక వాయిదా వేయొచ్చని.. ఈ బిల్లులపై చర్చలో ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్ధికలోటుపై నిలదీయాలని అన్నారు. సమావేశాలకు అందరూ హాజరుకావాలని, సభల్లో ప్రజల గొంతు ప్రతిధ్వనించాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా సమస్యలు చర్చించేందుకే శాసనసభ, మండలి, పార్లమెంటు ఉందని పేర్కొన్నారు.తాము పనిచేసేది ప్రజల కోసం తప్ప, ప్రతిపక్షం కోసం కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని నేతలకు చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షం లేకపోయినా సభ నిరాఘాటంగా జరిగిందని ప్రజలు భావించాలన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని ప్రజలు మరిచిపోయేలా చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు అన్నారు. సభకు గైర్హాజరై ప్రతిపక్షం చారిత్రాత్మక తప్పిదం చేసిందని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలన్నారు. శాసనసభలో, మండలిలో ప్రతినిమిషం ప్రజా సమస్యల పరిష్కారానికే వినియోగపడాలని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
Tags: Babu fire on Piyush Goyal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *