పార్టీ నేతలను సిద్ధం చేస్తున్న బాబు

Babu is preparing party leaders

Babu is preparing party leaders

Date:21/11/2018
గుంటూరు ముచ్చట్లు:
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల కావచ్చని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ఇదే జరిగితే పాలనకు, అనుమతుల మంజూరుకు, పూర్తయిన పనుల ప్రారంభానికి కేవలం 40 రోజులే మిగిలి ఉందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ నేతలను ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం చంద్రబాబు తరచూ పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రానున్న 20రోజుల్లో బీసీ సదస్సులు పూర్తి చేయాలని, ఆ తర్వాత డిసెంబర్ 2వ వారంలో రాష్ట్ర వ్యాప్త సదస్సును నిర్వహిస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదరణ పథకం కింద కుల వృత్తిదారులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అందరికీ పనిముట్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రధానంగా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్ దేశ వ్యాప్త ఎన్నికలకు సిద్ధమవుతుందని, ఇందులో భాగంగా డిసెంబర్ చివర, జనవరి మొదటి వారంలో షెడ్యూల్ జారీ చేస్తుందన్న సంకేతాలు అందుతున్నట్లు చంద్రబాబు తెలిపారని ఆ పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు. దీంతో కొత్తగా ప్రజల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించి వీలైనంత త్వరితగతిన మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారని వారు పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే పూర్తయిన, పూర్తి కావచ్చిన పనుల ప్రారంభానికి కూడా సిద్ధం కావాలన్నట్లు వెల్లడవుతోంది. ధర్మ పోరాట దీక్ష సభలను కూడా డిసెంబర్ 22వ తేదీతో ముగించనున్నామని అంతకంటే రెండు, మూడు రోజుల ముందే దేశంలోని బీజేపీ వ్యతిరేక పక్షాల నాయకులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించి వారందరినీ అమరావతికి ఆహ్వానించనున్నట్లు చంద్రబాబు వెల్లడించినట్లు నాయకులు తెలిపారు. పార్టీ నాయకులకు అధినేత సూచించిన విధంగా ఎన్నికలకు సిద్ధం కావడానికి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా వేగంగా పూర్తి చేసేందుకు ఉరకలు వేయాల్సిందేనని వారన్నారు.
Tags:Babu is preparing party leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *