బాబు తీవ్ర నిర్ణయాల దిశగా అడుగులు

Date:27/03/2018
విజయవాడ ముచ్చట్లు:
ప్రత్యేక హోదా ఏపీ జీవన్మరణ సమస్యగా మారింది. నాలుగేళ్లపాటు నాన్చిన కేంద్రం హోదా ఇవ్వకుండా.. విభజన హామీలను నెరవేర్చకుండా మొండి చేయి చూపింది. ఒకసారి హోదా కావాలని, మరోసారి ప్యాకేజీ చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊగిసలాట ధోరణిని అనుసరించింది. కానీ బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు దెబ్బతినడం, చివరి బడ్జెట్లోనూ రాష్ట్రానికి అరకొర కేటాయింపులే ఉండటంతో.. చంద్రబాబు వైఖరి మారింది. ఎన్డీయే నుంచి బయటకు రావడమే కాకుండా.. కేంద్రాన్ని సవాల్ చేస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి రంగంలోకి దిగారాయన. మంగళవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉందని భావించినా.. మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. లోక్‌‌సభలో రాజకీయ పక్షాల ‘గొడవ’తో చర్చ సాధ్యం కాలేదు. మంగళవారం ఉదయం చంద్రబాబు అఖిలపక్షం భేటి నిర్వహించగా.. వైసీపీ, జనసేన, బీజేపీ డుమ్మా కొట్టాయి. ప్రత్యేక హోదా పోరులో మైలేజీ పెంచుకోవడానికి పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. అవిశ్వాసం చర్చకు రాకుండా పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడితే అదే రోజు తమ పదవులకు రాజీనామాలు చేస్తామని వైసీపీ ఎంపీలు స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇదొక్కటే కాదు.. త్వరలోనే ప్రత్యేక హోదా కోసం జనసేనాని ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారనే వార్తలు కొద్ది రోజులుగా ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ అనూహ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరవధిక నిరసనకు దిగుతారనే ప్రచారం తాజాగా అమరావతిలో మొదలైంది. కేంద్రం తీరును నిరసిస్తూ.. ఆయన దేశరాజధానిలో నిరసన చేపడితే అదే దేశ రాజకీయాల్లోనే సంచలనం కానుంది. ఈ వార్తలు నిజమేనా? కాదా? అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది. సీఎం నిరసన చేపడితేనైనా కేంద్రం దిగి వస్తుందా..? పవన్ కల్యాణ్, జగన్, బాబు.. ఈ ముగ్గురిలో ఎవరు నిరసనలు, దీక్షలు చేపట్టినా..? అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే బాగుంటుంది. అంతే కానీ ప్రజల్ని తమవైపు తిప్పుకోవాలని, తమ పార్టీకి మైలేజీ రావాలని చేస్తే మాత్రం అది ఏపీ ప్రజల దౌర్భాగ్యమే.
Tags:Babu steps towards strong decisions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *