14 స్థానాలకు వెనుక…

Date:19/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు :
తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం ప్రత్యర్థి పార్టీలకు అందనంత వేగంగా ఎత్తులు, పైఎత్తులు వేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్లుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ మరో 14 స్థానాలకు అభ్యర్ధుల పేర్లను ఖ‌రారు చెయ్యకుండా పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఒకే విడతలో 105 స్థానాల్లో అభ్యర్ధులను ఖ‌రారు చేసిన కేసీఆర్‌ 14 స్థానాలు మాత్రం పెండింగులో పెట్టారు.
ఈ 14 స్థానాలను పెండింగ్‌లో పెట్టడం వెనుక కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ తెలంగాణ జనసమితితో ఏర్పడే మహాకూటమే కార‌ణ‌మంటున్నారు. ఈ కూట‌మిపై స్పష్టత వచ్చాకే ఈ జాబితాను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.టీఆర్‌ఎస్‌ ఇంకా అభ్యర్థులను ప్రకటించ‌ని జాబితాలో 3 ఎస్సీ రిజ‌ర్వ్‌ స్థానాలు ఉండగా మిగిలిన 11 జనరల్‌ స్థానాలు ఉన్నాయి. కేసీఆర్‌ అభ్యర్థులు ప్రకటించని జాబితాలో సూర్యాపేట జిల్లాలో ఆంధ్రా సరిహద్దులకు ఆనుకుని ఉన్న కోదాడ నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడ నుంచి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ కుమార్‌ రెడ్డి భార్య పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఈ నియోజకవర్గంలో సీమాంధ్రుల ప్రభావంతో పాటు సెటిల‌ర్ల ఓట్లు కూడా అభ్యర్థుల గెలుపు, ఓటమిలు నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ నుంచి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల విష‌యంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ప్రస్తుతం కోదాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జ్‌గా కే. శశిధర్‌ రెడ్డి ఉన్నారు.ఇక్కడ టీఆర్‌ఎస్‌ సీటును శశిధర్‌ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కేసీఆర్‌ సామాజికవర్గానికి చెందిన వేనేపల్లి చందర్‌రావు ఆయన కుమార్తె టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న తాజా పరిణామాలు బట్టి మనకు వినపడుతున్న సమాచారం ప్రకారం ఇక్కడ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బరిరిలోకి దింపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష్‌ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసేశారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్‌ స్థానాలు అయిన ఖమ్మం, పాలేరు, కొత్తగుడెం నుంచి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు.పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉండడంతో అక్కడ పట్టు చిక్కక పోవడంతో ఖమ్మం ఆ తర్వాత కొత్తగుడెం స్థానాలపై కన్నేసి అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఎర్త్‌ పెట్టే ప్రయత్నాలు చేశారు. కొత్తగుడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఎలాగైనా తప్పించాలని పొంగులేటి చాలా స్కెచ్‌లు వేశారు.
కొత్తగుడెంలో ఆయన సపరేట్‌గా తన వర్గాన్ని సైతం మెయింటైన్‌ చేశారు. అయితే కేసీఆర్‌ తిరిగి జలగం వెంకట్రావుకు సీటు ఇవ్వడంతో అసెంబ్లీకి వెళ్లాలని పొంగులేటి కల‌లు తీరేలా కనపడడం లేదు. ఈ క్రమంలోనే కేటీఆర్‌తో ఆయనకు ఉన్న అనుబంధం నేపథ్యంలో చివరకు కోదాడ నుంచి రంగంలోకి దిగేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.కేటీఆర్‌ సూచన మెరకు పొంగులేటి కోదాడ నుంచి పోటీ చేసే ఏర్పాటులు చేసుకుంటున్నట్టు కూడా సమాచారం.
అయితే స్థానికేత‌రుడు అయిన పొంగులేటికి కోదాడ నియోజకవర్గంలో స్థానిక టీఆర్‌ఎస్‌ శ్రేణులు సహకరిస్తాయా ? సీమాంధ్రుల ప్రభావం ఉన్న ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్‌ కలిస్తే పొంగులేటి ఎంత వరకు విజయం సాధిస్తారన్నది కూడా చూడాలి. అయితే ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉండడంతో కోదాడలో విజయం సాధిస్తే ఎమ్మెల్యేగా ఉండొచ్చు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి ఖమ్మం పార్లమెంటుకే పోటీ చెయ్యాలన్న ప్లాన్‌లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
Tags:Back to 14 positions …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *