Tamilsai as a boon to Kamalani

తెలంగాణలో గులాబీకి చెడ్డ రోజులా 

Date:30/11/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర సమితికి ఇటీవలి కాలం వరకూ రాష్ట్రంలో ఎదురే లేదు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెసు పార్టీలు బలమైన ప్రభావమే చూపాయి. అయితే జాతీయ ఎన్నికలు కావడంతో టీఆర్ఎస్ తనకు తాను సర్ది చెప్పుకుంది. ప్రజలకూ , తమ ప్రభుత్వానికి మధ్య అంతరం లేదని అనేక వేదికల నుంచి ప్రకటించింది. దానిని బలపరిచే విధంగానే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ వంటి ఎన్నికల్లో ప్రతిపక్షాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ప్రతిపక్ష స్థానం కోసం బీజేపీ, కాంగ్రెసు పోటీ పడుతున్నాయని ప్రజలు సైతం భావించారు. లోలోపల కొంత గుబులు ఉన్నప్పటికీ బీజేపీ వల్ల తమకు వెంటనే ముప్పు వాటిల్లదని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తూ వచ్చింది. అందుకు ప్రధాన కారణం బీజేపీకి గ్రామస్థాయిలో నిర్మాణం పెద్దగా లేదు. కాంగ్రెసుకు గ్రామగ్రామాన నాయకత్వం, నిర్మాణం ఉన్నాయి. సంస్థాగతంగా చూస్తే అధికార పార్టీ కంటే హస్తం పార్టీలోనే ఎక్కువమంది నాయకులు కనిపిస్తుంటారు. చారిత్రకంగా ఆ పార్టీకి ఉన్న పునాదులు అటువంటివి. అయితే కాంగ్రెసును తోసి రాజంటూ బీజేపీ ముందుకు రావడం టీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెడుతోంది.లోక్ సభ ఎన్నికలు, ఇతర అంశాలన్నింటి కంటే దుబ్బాక ఎన్నిక అధికార పార్టీని తీవ్రంగా కలచివేసింది. అధికార బలము, యంత్రాంగం, ఆర్థిక వనరులు, సానుభూతి వంటి రాజకీయ అస్త్రశస్త్రాలన్నీ తమ వద్ద ఉన్నప్పటికీ ఉప ఎన్నికలో ఫలితం తిరగబడింది. అధిష్ఠానం మనోస్థైర్యాన్ని దెబ్బతీసింది. నైతికంగా పార్టీ క్యాడర్ లోనూ తీవ్రమైన విషాదం నెలకొంది. తొలి దశలో బంపర్ మెజార్టీతో గెలుస్తామని భావించినా,

 

 

 

చివరికి వచ్చేటప్పటికి ఏదో రకంగా గట్టెక్కుతామని టీఆర్ఎస్ నాయకత్వం విశ్వసించింది. పార్టీ అతి విశ్వాసాన్ని ప్రజలు వమ్ము చేశారు. ఈ ఎన్నిక ఫలితానికి తానే బాధ్యుడినంటూ హరీశ్ రావు ప్రకటించినా దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. వివిధ రకాల పథకాలతో ప్రజలకు సంతృప్త స్థాయి కల్పించామని చెబుతున్న టీఆర్ఎస్ పాలనకు చెంప పెట్టు లాంటి తీర్పు ఇది. పోనీ బీజేపీ ఏమైనా కేంద్రంలో ఆకర్షణీయమైన పరిపాలన అందిస్తోందా? అంటే అదీ లేదు. కరోనా సమయం నుంచీ కేంద్రం లో పరిస్థితులు బాగా లేవు. ప్రభుత్వం కుప్పిగంతులు వేస్తోంది. లాక్ డౌన్ మొదలు , ఆర్థిక ప్యాకేజీల వరకూ కేంద్రం నిర్ణయాలతో ప్రజలు తీవ్రమైన అసంతృప్తికి గురవుతున్నారు. అయినా ఉప ఎన్నికలో అధికార పార్టీని కాదని రాష్ట్రంలో కమలానికి పట్టం గట్టారు. ఇది చారిత్రకమే. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో చోటు చేసుకున్న మార్పు దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి వారి నాయకత్వంలో కనిపించని పోరాట పటిమ ప్రస్తుత నాయకత్వంలో ప్రస్ఫుటమవుతోంది. చావో రేవో తేల్చుకోవాలనే తపన బలం లేని చోట్ల కూడా బలాన్నిస్తోంది. దుబ్బాక లో జరిగిన పరిణామమిదే.

 

 

 

పర్యవసానాలను పట్టించుకోకుండా అధికార పార్టీతో సై అంటూ రచ్చ కెక్కడం, తుది వరకూ పట్టు వీడకపోవడం కమలం పార్టీకి కలిసొచ్చింది. ఇదే పంథా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లోనూ కనబరిస్తే పరిస్థితులు తీవ్రంగానే ఉంటాయని అధికార టీఆర్ఎస్ కలత చెందుతోంది. ఎందుకంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ లో బీజేపీకి కొంచెం క్యాడర్ పరంగా పట్టు ఎక్కువ.రాష్ట్రంలో బీజేపీ బలపడిందనడం కంటే కాంగ్రెస్ బలహీనపడిందని చెప్పుకోవడం ఉత్తమం. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ హస్తం పార్టీ నాయకులు గుణపాఠం నేర్చుకోవడం లేదు. రాష్ట్రంలో ముఠాలు, వర్గాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. పార్టీకి తొలి నుంచి వెన్నుదన్నుగా ఉన్న సామాజిక వర్గానికి, వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకత్వం సవాల్ విసురుతోంది. కనుచూపు మేరలో అధికారం కనిపించకపోవడంతో టీఆర్ఎస్ కు తాము ప్రత్యామ్నాయమవుతామని భావిస్తున్న కాంగ్రెసులోని అగ్ర సామాజిక వర్గం కూడా తట్టాబుట్టా సర్దుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గడచిన ఏడాది కాలంగా కాంగ్రెసు పార్టీ ఇతర పార్టీల నుంచి నాయకులను, క్యాడర్ ను ఆకర్షించలేకపోయింది.

 

 

 

అదే సమయంలో టీఆర్ఎస్ వ్యతిరేకులను బీజేపీ పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ తమ స్థానాలను ఖాళీ చేసేశాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చాలా వరకూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా 30 శాతం వరకూ ఏ పార్టీలోనూ చేరకుండా నిర్లిప్తంగా ఉండిపోయిన వారున్నారు. వారికి ఏదో ఒక పార్టీ నుంచి రాజకీయాశ్రయం కావాలి. అధికార పార్టీలో బెర్తులు లేవు. కాంగ్రెసు పార్టీ భవిష్యత్తుపై ఆశలు లేవు. ఇటువంటి వారికిప్పుడు బీజేపీ పెద్ద ఆకర్షణగా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాదులో అధికారం రాకపోయినా బలమైన పోరాట పటిమతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిస్తే కమలం పంట పండినట్లే. పార్టీకి జిల్లాల్లో బలమైన నాయకత్వం ఏర్పడేందుకు అవకాశం కలుగుతుంది. పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన 30 పైచిలుకు జిల్లాలు ఇప్పుడు ప్రతిపక్షాలకూ కలిసి వస్తున్నాయి. రాజకీయంగా పదవులు పంపిణీ చేసి, పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఉపకరిస్తున్నాయి.

 

 

 

 

నాయకత్వం, వ్యక్తిగత కరిష్మాతో కేసీఆర్ రెండు సాధారణ ఎన్నికల్లో అనాయాసంగా నెగ్గుకొచ్చారు. భవిష్యత్తులో ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజలు తీర్పు చెబుతారు. పదేళ్ల పాలన తర్వాత కేసీఆర్ కు దీటైన నాయకుడెవరనే కోణంలో ఆలోచిస్తారు. అదృష్టవశాత్తు కేసీఆర్ కు దీటైన నాయకుడు ఇంకా ప్రతిపక్ష శిబిరాల్లో కనిపించకపోవడం టీఆర్ఎస్ కు కలిసొస్తోంది. జాతీయ స్థాయి ఎన్నికలతో కలిపితే ఆ ప్రభావం ఫలితాలపై పడుతుందనే అంచనాతోనే కేసీఆర్ 2018లోనే అసెంబ్లీ ఎన్నికలు పెట్టించుకున్నారు. కేసీఆర్ అంచనా తప్పలేదు. లోక్ సభ ఎన్నికలతో కలిపి ఉంటే కనుక కచ్చితంగా టీఆర్ఎస్ ప్రాబల్యం కొంత తగ్గి ఉండేది. 2023-24 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో ఇమేజ్ పెంచుకోవడం ద్వారా రాష్ట్రంలోనూ పట్టు సాధించాలని కేసీఆర్ యోచిస్తున్నారు.

 

 

రానున్నది గడ్డుకాలమే….

తెలంగాణ నాయకత్వం దేశాన్ని శాసిస్తుందనే భావన ప్రజల్లోకి పంపాలనేది కేసీఆర్ ఉద్దేశం. బీజేపీ విసురుతున్న సవాల్ ను దీటుగా తిప్పికొట్టాలంటే తన ఇమేజ్ ను ప్రజల్లో వ్యాప్తి చేసుకోవాలి. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం కనిపించకుండా చేసుకోవాలి. ఈ వ్యూహంతోనే కాంగ్రెసు, బీజేపీయేతర పార్టీలతో ఫ్రంట్ కట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారు. గతంలో ఈ ప్రయత్నం చేసినా పెద్దగా ఫలించలేదు. ఈ సారి కూడా పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు లేవు. దక్షిణాదిలో ఏ ఒక్కసార్టీ కేసీఆర్ ను భుజాలపైకి ఎత్తుకోకపోవచ్చు. నిన్నామొన్నటివరకూ మిత్రునిగా ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ సైతం ఇటీవలి కాలంలో దూరమయ్యారు. డీఎంకే అధినేత స్టాలిన్ కాంగ్రెసుతో కలిసి నడుస్తున్నారు. ఈ స్థితిలో మూడో ఫ్రంట్ పేరిట సాగించే హడావిడి ప్రచారానికే పరిమితమవుతుంది. కాంగ్రెసు, బీజేపీలకు హెచ్చరికలు పంపి బేరసారాలు, సర్దుబాట్లు చేసుకోవాలని యోచిస్తున్న చిన్నాచితక పార్టీలు కేసీఆర్ నిర్మించే వేదికను ప్రాతిపదికగా చేసుకునే అవకాశాలున్నాయి. మొత్తమ్మీద టీఆర్ఎస్ గడ్డుకాలాన్నే ఎదుర్కొంటోంది.

మార్చిలోగా వంశధార- నాగావళి అనుసంధానం

Tags: Bad days for the rose in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *