Natyam ad

ఆదర్శంగా నిలుస్తున్న బాలభారతి

కర్నూలు ముచ్చట్లు:


తెలుగు రాష్ట్రాల్లోని పొదుపు సంఘాలు ఎంతటి ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. అయితే.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపు లక్ష్మి ఐక్య సంఘం మహిళలు సాధించిన విజయం మాత్రం అతిపెద్ద విశేషమని, అద్భుతమని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని చెప్పొచ్చు. రూపాయితో పొదుపు మొదలు పెట్టి 7 కోట్ల రూపాయలతో స్కూల్ నిర్మించారు. అక్షరమ్ముక్క కూడా రాని మహిళలు శ్రమదానం చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను అందుబాటులోకి తేవటం ఒకరకంగా అసాధ్యమే అయినా సుసాధ్యం చేసి చూపారు. తమలా తమ పిల్లలు నిరక్షరాస్యులుగా ఉండకూడదనే పట్టుదలతో ఆ తల్లిదండ్రులు పడిన తపన సమాజానికి ఆదర్శమనటంలో ఎలాంటి సందేహంలేదు. మైసూర్‌ మహరాజ ప్యాలెస్‌ను తలపించేలా, ఇంటర్నేషనల్‌, కార్పొరేట్‌ స్కూల్‌లా కనిపిస్తున్న ఆ బడి పేరు బాల భారతి స్కూల్‌.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో పొదుపు లక్ష్మి ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ వరుసగా మూడో ఏడాది రూ.10 లక్షల విరాళాన్ని అందించింది. ప్రముఖ గాయని సునీత ఈ చెక్కును పాఠశాల కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మికి  అందజేశారు. అనాథ విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ చైర్మన్‌ పొట్లూరి రవి తెలిపారు. ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్న బాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమంటూ మహిళలను సునీత అభినందించారు. బాలభారతి పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలకు తన వంతు సహకారం అందిస్తానని సునీత తెలిపారు.

 

Tags: Bala Bharati who stands as an example

Leave A Reply

Your email address will not be published.