మరో వివాదంలో బాలినేని

ఒంగోలు  ముచ్చట్లు:

కాంట్రవర్సీలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్సా..? ఆయన ప్రకటనలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతున్నాయా? స్వపక్షాన్ని ఆయనే ఇరుకున పెడుతుంటారా? ఆ మధ్య సొంత వాళ్లే తనపై కుట్ర చేస్తున్నారని చెప్పి కలకలం రేపితే.. తాజాగా తనలోని కళాపోషణను బయట పెట్టుకున్నారా? ఆయన వైఖరితో సొంత పార్టీ వాళ్లే తల పట్టుకుంటున్నారా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథా?మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మాటలో తడబాటు లేదు. తొత్తపాటు కనిపించలేదు. ఆయనలోని కళాపోషణ ఎలాంటిదో అందరికీ అర్ధమైంది. అప్పట్లో పేకాట కోసమే స్పెషల్ ఫ్లయిట్‌లో రష్యా వెళ్లారని ప్రచారం జరిగింది. ఫొటోలు బయటకొచ్చాయి. అప్పుడే రచ్చ రచ్చ అయింది. తాజాగా చికోటి ప్రవీణ్‌ ఉదంతంలో బాలినేని పేరు చర్చకు రావడంతో మీడియా ముందుకు తడుముకోకుండా తన అలవాటును బయటపెట్టేశారు. ఈ కామెంట్స్‌ ఆయనకు చిన్నవిగా కనిపించొచ్చు. కానీ.. పొలిటికల్ సర్కిళ్లలో అవే హాట్ టాపిక్క్‌గా మారాయి. తన చుట్టు మరోసారి చర్చకు ఆస్కారం కల్పించారు ఈ మాజీ మంత్రి.వైసీపీలో ద మోస్ట్‌ కాంట్రవర్సీ నాయకుడు ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే పేర్లలో ఒకరు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. వైఎస్‌ కుటుంబానికి బంధువు. మొన్నటి కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో మంత్రివర్గంలో చోటు కోల్పోయారు. పేకాటలో బాలినేనిది పెద్ద హ్యాండే అన్నది ప్రకాశం జిల్లాలో వినిపించే మాట. అది ఆయన వ్యక్తిగత వ్యవహారమే అయినప్పటికీ.. మంత్రిగా పనిచేసి ఉండటం.. ప్రస్తుతం ఎమ్మెల్యే కావడం.. అధికారపార్టీలో సీనియర్‌గా కొనసాగడంతో ఫోకస్‌ పెరిగిపోయింది. దీనికితోడు క్యాసినోకు వెళ్తానని..

 

 

 

పేకాట ఆడతానని మీడియా ముందే చెప్పడం ప్రత్యర్థుల చేతికి ఆయుధం ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది.చికోటి ప్రవీణ్‌తో సంబంధాలు లేవని చెప్పినా.. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి పేకాట ఆడతానని చెప్పుకోవడం తమకు ఇబ్బందిగా మారిందని అధికారపార్టీ వర్గాల వాదన. విలాస పురుషుడిగా బాలినేనికి పార్టీ ఇన్నర్‌ సర్కిళ్లలో ముద్ర ఉంది. ఆపై ఇలాంటి ఓపెన్‌ స్టేట్‌మెంట్స్‌తో సర్కార్‌ను నేరుగా ఇరుకున పెట్టడమే అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. అయినప్పటికీ.. బాలినేనికి ఇది కొత్తకాదు. ఆ మధ్య సొంత పార్టీ నాయకులే తనపై కుట్ర చేస్తున్నారని సంచలనం రేపారు. అలా కుట్ర చేస్తున్న వారి వివరాలు బయట పెడతానని చెప్పారు. దీంతో బాలినేని వ్యాఖ్యలను ఖండించాలో.. సమర్థించాలో అర్థంకాక పార్టీ పెద్దలు తల పట్టుకుంటున్నారట.మంత్రి పదవి నుంచి తప్పించినప్పుడు కూడా అందరి కంటే ఎక్కువగా హంగామా సృష్టించింది బాలినేనే. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు రెండు మూడు దఫాలు వెళ్లి అనునయించే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. చివరకు సీఎం జగన్ రంగంలోకి దిగి మాట్లాడితేకాని బాలినేని మెత్తబడలేదు. వీటికి తోడు ప్రకాశం జిల్లాలోని మిగిలిన ముఖ్య నేతలతో మాజీ మంత్రికి సఖ్యత తక్కువే. అందుకే బాలినేని వైఖరి వల్ల జిల్లాలో పార్టీకి ఇబ్బంది అవుతోందన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఆయన మాత్రం అవేమీ పట్టనట్టు తన స్టయిల్‌ తనదే అన్నట్టు ముందుకెళ్తూ కాంట్రవర్సీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారు.

 

Tags: Balineni in another controversy

Leave A Reply

Your email address will not be published.