కోల్ కత్తాలో బంగ్లాదేశ్ భవన్ 

Date:25/05/2018

కోల్ కత్తా ముచ్చట్లు:
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ భవన్‌ను ప్రారంభించారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు మరింత ఇనుమడింపచేసేందుకు సూచనగా.. పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి యూనివర్సిటీ ప్రాంగణంలో బంగ్లాదేశ్ భవన్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు.బంగ్లాదేశ్ భవన్‌లో ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ఆ దేశంతో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. లిబరేషన్ వార్ ఆఫ్ బంగ్లాదేశ్, భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను గుర్తు చేసేలా బంగ్లాదేశ్ భవన్‌ను తీర్చిదిద్దారు. దీన్ని నిర్మించేందుకు రూ.25 కోట్లు ఖర్చుకాగా… ఈ మొత్తాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వమే భరించడం విశేషం. మ్యూజియం పరిసరాల నిర్వహణ కోసం మరో రూ.10 కోట్లు ఇవ్వనున్నారు.నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను ఏకి పారేయడంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఎప్పుడూ ముందే ఉంటారు. పెద్ద నోట్ల రద్దు, మొబైల్ సిమ్‌లకు ఆధార్ అనుసంధానం వంటి అంశాలపై ఆమె తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అలాంటి మమత శుక్రవారం ప్రధాని మోదీతో కలిసి ఒకే వేదికపై ఆశీనులయ్యారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వీరిద్దరూ పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రెండు దేశాల ప్రధాన మంత్రులు హాజరైన అరుదైన సంఘటన శుక్రవారం జరిగింది.శాంతినికేతన్‌కు ప్రధాని మోదీ హెలికాప్టర్‌లో చేరుకున్న వెంటనే మమత బెనర్జీ సాదరంగా స్వాగతం పలికారు. ఆయనకు శాలువ కప్పి, పూలగుచ్ఛం అందజేసి, నమస్కరించారు. మోదీ కూడా మమతను సాదరంగా పలుకరించారు. అనంతరం ఇరువురూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో షేక్ హసీనా, మమత బెనర్జీ, నరేంద్ర మోదీ ఒకే వేదికపై ఆశీనులయ్యారు.
రోహింగ్యాలను పంపించండి
కోల్ కత్తా, మే 25
మయన్మార్ నుంచి వచ్చిన రొహింగ్యా ముస్లింలను తిరిగి ఆ దేశానికి పంపించడంలో భారతదేశం కీలక పాత్ర పోషించాలని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని శాంతి నికేతన్‌లో బంగ్లాదేశ్ భవన్‌ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ బంగ్లాదేశ్‌కు వచ్చిన రొహింగ్యాలకు తన ప్రభుత్వం మానవతా సాయం అందిస్తోందన్నారు. వీరిని మయన్మార్ తిరిగి తీసుకెళ్ళేలా అంతర్జాతీయ సమాజం సహకరించాలని కోరారు.రొహింగ్యాలు బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందారని, మానవతా కారణాలతో తాము వారికి స్థలాన్ని ఇచ్చామని చెప్పారు. వారు తమ స్వదేశానికి వెళ్ళిపోవాలని తాము కోరుకుంటున్నామన్నారు. మయన్మార్‌తో చర్చలు జరిపేందుకు సహకరించాలని కోరారు.2017 ఆగస్టులో మయన్మార్‌లోని రఖైన్‌లో సైనిక శిబిరాలపై దాడి చేసిన రొహింగ్యాలపై ప్రతి దాడులు జరిగాయి. దీంతో దాదాపు 7 లక్షల మంది రొహింగ్యాలు దేశం విడిచి బంగ్లాదేశ్ వెళ్ళారు. వీరంతా బంగ్లాదేశ్‌లో శరణార్థి శిబిరాల్లో ఉన్నారు. కొందరు భారతదేశంలో కూడా ఉన్నారు.
Tags: Bangladesh Bhavan in Kolkata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *