సిద్దేశ్వరం వద్ద తీగల వంతెన బదులు బ్యారేజ్ కం వంతెన నిర్మించాలి
నంద్యాల ముచ్చట్లు:
కరువు, వలసల పీడిత ప్రాంతమైన రాయలసీమ న్యాయమైన డిమాండ్స్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారించాలని, నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం వద్ద కృష్ణానది పై తీగల వంతెన బదులు బ్యారేజ్ కం వంతెన నిర్మించాలని మాజీ జడ్ పి టీ సి యామ గుర్రప్ప, రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు యం. వి. రమణారెడ్డి లు కోరారు.
మండల కేంద్రమైన శిరివెళ్లలో బుధవారం రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రైతుల సమావేశం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ను కలుపుతూ నాలుగులైన్ల జాతీయ రహదారి నిర్మిస్తోందని, 167K జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై సుమారు రూ. 11వందల కోట్ల తో ఐ కానిక్ (తీగల ) వంతెన నిర్మాణం చేస్తుందన్నారు. ఈ తీగల వంతెన వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదని, బ్యారేజ్ కం వంతెన నిర్మిస్తే కరువును తరిమెందుకు సాగు, తాగు నీరు రాయలసీమకు అందుతుందన్నారు.
మన ప్రాంతంలోని కె సి కెనాల్, తెలుగుగంగా ఆయకట్టు రైతు లకు సాగునీరు అందాలంటే శ్రీశైలం జలాశయంలో 854 అడుగులమేరా నీరునిల్వ ఉండాలని, ఆ నీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూ లేటర్ ద్వారా వస్తుందని, అయితే అటు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో, మన పాలకులు కృష్ణా డెల్టా ఆయకట్టు, చేపలు, రొయ్యల చెరువులు కాపాడేందుకు శ్రీశైలం జలాశయాన్ని తోడేస్తూ రాయలసీమ రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
ఈ సమావేశంలో మాజీ ఎం పి టీ సి కె. బాలచంధ్రుడు, రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ సెక్రటరీ యం యం డి ఇస్మాయిల్, రైతు నాయకులు చల్లా గోపాల్, ఎస్ ఏ మాలిబాష, ఉల్లి తిరుపాల్, పి పి లింగమయ్య, తమ్మినేని రాజగోపాల్ రెడ్డి, వనివేటి లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags; Barrage cum bridge should be constructed instead of cable-stayed bridge at Siddeswaram
