Natyam ad

అందాల అభినేత్రి… విశాల నేత్రి ప్రముఖ నటి భానుప్రియ కి పుట్టినరోజు శుభాకాంక్షలు 

అమరావతి ముచ్చట్లు:
 
* రెండు కళ్ళతో శతకోటి భావాలని వ్యక్తీకరించే ఓ సావిత్రి…
నృత్యంతో అలరించే ఓ పద్మిని… చూపు తిప్పుకోలేని అందం…
అభినయంతో అభిమానులని ఆకట్టుకున్న వైజయంతి మాల…..
ఈ ముగ్గురు అభినేత్రుల అరుదైన కలయిక ఈ తారక
– తమిళ సినిమాల కధానాయకుడు శివాజీ గణేశన్‌
* షీ ఈజ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ అండ్‌ బెస్ట్‌ యాక్ట్రెస్‌ ఐ ఎవెర్‌ సీన్‌… ఫొటోజెనిక్‌ పేస్‌. ఎక్కువ మేకప్‌ అవసరం లేదు.
తక్కువ మేకప్‌ తోనే మెప్పిచగల అందం ఆమెది.
– సినిమాటోగ్రాఫర్‌ పి.సి. శ్రీరామ్
* ఆమె గొప్ప నటే కాదు…గ్రేస్‌ ఫుల్‌ డాన్సర్‌…
అసంఖ్యాక అభిమానుల ఉవాచ..
ఔను ఆమె ఆనంద భాను. తెలుగు, హిందీ, కన్నడ, మళయాళ సినిమాల్లో ఓ ఊపు ఊపిన ఆర్టిస్ట్‌. ఆమె అభినయ సరస్వతి. కళా వాచస్పతి. రసజ్ఞులు మెచ్చే కూచిపూడి నృత్య కళాకారిణి. ఆపై…అవార్డుల నటి. అదే సమయంలో కమర్షియల్‌ సినిమాకి తన సొగసుసోయగాలాలతో గ్లామర్‌ అద్దిన ఆర్టిస్ట్‌. అంతేనా? తాను అందాల అభినేత్రి. విశాల నేత్రి. ఆమె కళ్ళు వెన్నెల వాకిళ్లు. ఈస్టమన్‌ కలర్‌ కలల లోగిళ్ళు. పేరు…ఆనంద భాను.. అనగానే ప్రేక్షకులంతా మనకు తెలీని ఈ ఆర్టిస్ట్‌ ఎవరెవరా? అని కాస్త తికమక పడడం ఖాయం. అదే…భాను ప్రియ అని ఆమె పేరు చెప్పగానే…వీక్షకుల హృదయ వేదికలపై కూచిపూడి నర్తన పులకింతలు లోను చేస్తుంది. భాను ప్రియ… కళాకారిణిగా సాధించిన విజయాలు ఎన్నో? అభిమానుల నుంచి అందుకున్న అభినందనలు మరెన్నో? నృత్య ప్రాధాన్యత గల కొన్ని పాత్రలు కేవలం ఆమె కోసమే పురుడు పోసుకున్నాయేమో? కళాతపస్వి కె.విశ్వనాధ్‌ మెచ్చిన ‘స్వర్ణకమలం’. సృజనశీలి వంశీకి నచ్చిన మహల్లో కోకిల. ఔను… ఆయన ఎంతో ఇష్టపడి రాసుకున్న ఆ నవల సితారగా తెరకెక్కితే…అందులో నాయిక భానుప్రియ. హాస్య బ్రహ్మగా ప్రసిద్ధి చెందిన దర్శకుడు జంధ్యాల సృష్టించిన నాయికలని తెరపై ప్రాణ ప్రతిష్ట చేసిన కథా నాయిక తాను. కమర్షియల్‌ సినిమాల దర్శకులకు కాసుల వర్షం కురిపించిన అందాల భరిణ. ఇప్పటికీ…ఆమె చిత్రాలు వీక్షకుల గుండె తెరపై రోజుకు నాలుగాటలుగా కదలాడుతూనే ఉన్నాయంటే…అతిశయోక్తి కాదేమో? అంతలా… భానుప్రియ వెండితెరపై చెరగని ముద్ర వేసింది. గోదారి వొడ్డున కళ్ళు తెరిచిందేమో… ఆ నదీమతల్లి ఉరుకులు, పరుగుల వేగం…ఉద్వేగం ఆమె వ్యక్తిత్వంలోనే సంతరించుకుంది. ఎక్కడో చిన్న బిందువుగా పుట్టిన నది…కొండలు, కోనలు, భౌగోళిక సరిహద్దులు దాటి…చివరికి అనంత సాగరంతో చెట్టాపట్టాలేసినట్లు… నటి జీవితం కూడా నది జీవితం లాంటిదే. రాజమహేంద్రవరంకి సమీపంలోని చిన్న గ్రామం రంగంపేటలో పుట్టిన ఆనంద భాను అనే ఓ అమ్మాయి.. చెన్నై చేరుకొని నటిగా మారడమే కాకుండా వివిధ భాషల్లో అగ్రస్థానాన్ని సాధించుకుని విజయ పతాక ఎగురవేయడం నిజంగా ఓ తపస్సే. సినిమా కోసం ఆనంద భాను అనే తన పేరును…భాను ప్రియగా మార్చుకుంది. ఆ పేరుతోనే… విఖ్యాతి గాంచింది. అడుగుపెట్టిన చోటల్లా…అభినయ తారకగా చెదరని సంతకం చేసింది. 1963 జనవరి 15న భాను ప్రియా పుట్టింది. తల్లి తండ్రులు రంగమాలి, పండుబాబు. అనంతరం వ్యాపారరీత్యా వీరి కుటుంబం చెన్నైకి తరలి వెళ్లింది.
నృత్యమంటే మక్కువ ఎక్కువ..
భానుప్రియకి చిన్నతనం నుంచే నృత్యమంటే మక్కువ ఎక్కువ. కూచిపూడి, భరతనాట్యంలో ఒకే గురువు దగ్గర శిక్షణ పొందింది. గురువుగారు నృత్యాభినయనం సందర్భంలో వివిధ భావాల్ని ముఖంలో పలికించే తీరు గురించి భోదించగా…తర్వాత్తర్వాత చిత్రాల్లో అభినయ సమయంలో ఆమెకి పనికివచ్చింది. 1983లో ‘మెల్ల పసుంగల్‌’ తమిళంలో మొదటి సినిమా. ఆ సినిమా తరువాత…ఆమె తెలుగులో అడుగుపెట్టింది. తెలుగులో మొదటి సినిమా ‘ప్రేమ దీపాలు’ విడుదలకు నోచుకోలేదు. ఆ తరువాత దర్శకుడు వంశీ చిత్రం ‘సితార’లో కథానాయికగా నటించే అవకాశం భానుప్రియకి దక్కింది. ఆ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు అందుకుంది. ఆ తరువాత వంశీ దర్శకత్వంలో కొన్ని చిత్రాల్లో నటించింది. భానుప్రియ, వంశీ కాంబినేషన్‌లో ‘అన్వేషణ’ చిత్రం ప్రత్యేకతను చాటుకుంది. ఇళయరాజ సంగీతం, భానుప్రియ అభినయ సౌందర్యం, వైవిద్యభరితమైన కథాకథనాలు ‘అన్వేషణ’ చిత్రాన్ని ప్రేక్షకులు నచ్చే చిత్రంగా మలచాయి. తెలుగు, తమిళ భాషల్లో నటించిన భానుప్రియ ‘దోస్తీ దుష్మన్‌’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. 1988లో కళాతపస్వి కె.విశ్వనాధ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణ కమలం’ చిత్రం భానుప్రియని వెండితెర నృత్య తారకంగా మలిచింది. కట్టిపడేసే కళ్లతో భానుప్రియ వ్యక్తీకరించిన భావాలు ప్రేక్షక జనాల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘అర్ధం చేసుకోరూ…’ అంటూ ఆ చిత్రంలోని ఆమె మాటని పదుగురు అందిపుచ్చుకున్నారు. వివిధ సందర్భాల్లో ఆమె అదే మాటని పలురకాలుగా అనడం చిత్రానికే హైలైట్‌. ఈ చిత్రం 1988లో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రదర్శనకు నోచుకుంది. అలాగే, అన్‌ అర్బోర్‌ చిత్రోత్సవంలో కూడా పాలు పంచుకుంది. అంతే కాదు… ఇండియన్‌ ఎక్సప్రెస్‌ ఈ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటి అవార్డుతో భానుప్రియను సత్కరించింది. ఈ చిత్రానికి సంబంధించి మీడియాతో ముచ్చటిస్తూ దర్శకుడు విశ్వనాధ్‌ భానుప్రియ నటనని అభినందించారు. ఈ చిత్ర కథానాయకుడు వెంకటేష్‌ ఒకానొక సందర్భంలో తాను నటించిన ఎంతోమంది కథానాయికల్లో భానుప్రియ ఒకరైనా… ఓ సన్నివేశంలో ఆమె కళ్ళను రెప్పవాల్చకుండా చూడాల్సి వచ్చిందని మెచ్చుకున్నారు. ఆమె అద్భుతమైన నటి అని కొనియాడారు. ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలింఫేర్‌ అవార్డు కూడా భానుప్రియకి తెచ్చిపెట్టిన చిత్రం ఇది. సుదీర్ఘమైన సీనియాణంలో భానుప్రియ సుమారు 150 చిత్రాలకు పైగా నటించింది. అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించాలనే తపన ఆమెలో మెండుగా ఉంది. అందుకే…దర్శకుడు రాజమౌళి ‘ఛత్రపతి’ చిత్రంలో అమ్మ పాత్రలో నటించి మెప్పించింది. ఆ చిత్రంలో చేసింది చిన్న పాత్రే అయినా…ప్రేక్షకులకు బాగా గుర్తుండే పాత్రగా దర్శకుడు మలచారు. ఒట్టేసి ఒకమాట…ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పానన్న డైలాగ్‌ ఈ చిత్రానికే హైలైట్‌.
నాగార్జునతో జోడీగా నటించలేదు..
నాగార్జునకు జోడిగా భానుప్రియ నటించలేదు. ఆ కొరత ఉందని ఆమె తరచూ చెప్తున్నా… దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిత్రం ‘అన్నమయ్య’ చిత్రంలో పద్మావతి పాత్రలో ఎంచక్కా ఒదిగిపోయింది భానుప్రియ. శ్రీ వేంకటేశ్వరుడు అంటే తనకెంతో భక్తి ప్రపత్తులని చెప్తూ… ‘అన్నమయ్య’ చిత్రంలో అంత మంచిపాత్ర రావడం నిజంగా అదృష్టమని ఆమె అంటోంది.
బాపు చిత్రంలోనూ నటించలేదు..
బాపు చిత్రాలు కధానాయిక ప్రాధాన్యత గల చిత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. కధానాయిక కళ్లు ఎంత అందంగా ఉంటే… బాపు ఆ నాయికను ఏరికోరి మరీ తన చిత్రాల్లో నటింపచేస్తారు. విశాల నేత్రిగా భానుప్రియకి పేరున్నా బాపు చిత్రంలో నటించకపోవడం నిజంగా కొరతే. అదే విషయాన్ని ఆమె కూడా సందర్భం వచ్చినప్పుడల్లా వ్యక్తం చేసింది. కళాత్మక చిత్రాల్లోనే కాకుండా కమర్షియల్‌ చిత్రాల్లో కూడా ఆమె నటించి పేరు తెచ్చుకుంది. కోదండరామిరెడ్డి చిత్రం ‘కార్తీక పౌర్ణమి’ గురించి ఆమె ఎంతగానో చెపుతుంది. అలాగే… జంధ్యాల చిత్రాల్లో కూడా మంచిపాత్ర వేశానని ఆమె అంటుంది. జంధ్యాల ‘మొగుడూపెళ్లాలు’ చిత్రం…తానెప్పటికీ మరిచిపోలేనని ఆమె అంటుంది. తాను డాన్సులో శిక్షణ పొందినా…చిరంజీవితో నర్తించడం ప్రత్యేకంగా చెపుతుంది. చిరంజీవి మంచి డాన్సర్‌ అంటూ ఆమె మెచ్చుకుంటుంది.
అవార్డులు..
1988లో ‘స్వర్ణ కమలం’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది. అదే సంవత్సరం ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకుంది. 1989లో తమిళ చిత్రం ‘ఆరారో ఆరిరారో’లో పాత్రకుగాను ఫిలిం ఫేర్‌ అవార్డు అందుకుంది. అదే చిత్రానికి 1989లో తమిళనాడు స్టేట్‌ అవార్డు కూడా భానుప్రియను వరించి వచ్చింది. 1991లో తమిళ చిత్రం ‘ఆజగాన్‌’లో నటనకు గాను మల్లె తమిళనాడు స్టేట్‌ అవార్డు అందుకుంది. 1996లో తెలుగు చిత్రం ‘పెదరాయుడికి’గాను సినిమా ఎక్సప్రెస్‌ అవార్డు అందుకుంది. టెలి సీరియల్‌ శక్తిలో నటనకుగాను స్కీన్ర్, వీడియోకాన్‌ అవార్డు అందుకుంది. 2002లో బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టెస్ర్‌గా ‘లాహిరి లాహిరి లాహిరి’లో… చిత్రానికిగాను నంది అవార్డు అందుకుంది. 2005లో బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టెస్ర్‌గా ‘ఛత్రపతి’ ..చిత్రానికిగాను నంది అవార్డు అందుకుంది. ఇలా భానుప్రియ నటప్రస్థానములో చేరుకున్న విజయాల మజిలీలు… దాటినా మైలురాళ్ళు ఎన్నో…ఎన్నెన్నో? ఆమె వెండి తెర నృత్యతారక. అభిమానుల గుండెల్లో దాగిన వెన్నెల తునక. కాదంటారా?
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Beauty Actress … Happy Birthday to Broad Actress Bhanupriya

Leave A Reply

Your email address will not be published.