ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కు బెజవాడ

Date:09/11/2018
విజయవాడ ముచ్చట్లు:
అంతర్జాతీయ వేడుకలకు విజయవాడ వేదిక కానుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో ఎఫ్‌1హెచ్‌2ఓ(పవర్‌ బోట్‌ రేస్‌) ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సోమవారం వెలగపూడి సచివాలయంలో సంబంధిత అధికారులు, పోటీల నిర్వాహకుల ప్రతినిధులతో సమావేశమైంది.
దీనికి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించారు. సమావేశానికి సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, భూమా అఖిలప్రియ హాజరుకాలేదు. ఈ పోటీలను తిలకించేందుకు సుమారు లక్ష మందికిపైగా వస్తారు.దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌, పార్కింగ్‌, సీటింగ్‌, భద్రత, ఆతిథ్యం తదితరాల ఏర్పాట్లను ఉప సంఘం సమీక్షించింది. ప్రస్తుతానికి 50వేల మందికి సరిపడేలా సీటింగ్‌ ఏర్పాట్లుజరిగాయని, కనీసం మరో 50వేల మందికి సీటింగ్‌ ఏర్పాట్లు చేయాల్సి ఉందని సమావేశంలో నిర్ణయించారు.
వీఐపీ, వీవీఐపీ పాస్‌ల జారీ బాధ్యతను కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. ఈ నెల 16 నుంచి 18 వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. ప్రధానంగా పోటీలు జరగనున్న ప్రాంతాన్ని 12విభాగాలుగా విభజించి.. ఒక్కోదాంట్లో ఎవరెవరికి ఏ ఏర్పాట్లుచేయాలనేదీ ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.మరో పక్క, విజయవాడ పున్నమి ఘాట్‌లో ఈ నెల 23 నుంచి 25 వరకు ‘అమరావతి ఎయిర్‌ షో’ నిర్వహించనున్నారు.
25న ప్రదర్శనకు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ) సహకారంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ప్రదర్శనకు ఆతిథ్యమివ్వనుంది. 4 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో యూకే బృందం, గ్లోబల్‌ స్టార్స్‌ బృందాలు విన్యాసాలు చేయనున్నాయి.రాష్ట్రంలోని వారసత్వ సంపద, ప్రముఖ పర్యాటక కేంద్రాల మీదుగా ‘టూర్‌ హెరిటేజ్‌’ పేరుతో సుదీర్ఘ సైకిల్‌ యాత్రను ఈ నెల 16న విజయవాడలో ప్రారంభించనున్నారు.
అదే విధంగా, ఈ నెల 9న ‘వివిధ రంగాలపై సోషల్ మీడియా ప్రభావం’ అంశంపై విజయవాడలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, మాజీ ఎంపీ, సినీ నటి దివ్య స్పందన ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారని రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటించింది. 10న నిర్వహించే బహుమతుల వేడుకకు బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌, సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ హాజరవుతారని వెల్లడించింది.
Tags: Bejawada to International Events

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *