ఐపీఎల్ లో బెట్టింగ్స్…

Betting on IPL ...

Date:16/04/2019

వరంగల్ ముచ్చట్లు :
ప్రస్తుతం యువతరం నుంచి చిన్నా, పెద్దా అందరి దృష్టి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌పైనే పడింది. ఎక్కడ చూసినా.. నలుగురు కూడినా.. ఐపీఎల్ మ్యాచ్‌ల గురించే చర్చ జరుగుతోంది.. ఇక యువకులు మాత్రం అరచేతిలోనే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించడం కూడా కనిపిస్తోంది. ఐపీఎల్ క్రికెట్ సీజన్ మొదలు కావడంతో మండలవ్యాప్తంగా బెట్టింగ్‌రాయుళ్లు పందేలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. మండలకేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో యువత మొదలుకుని కొందరు పెద్దల వరకు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు కాస్తూ వేలల్లో నష్టపోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ ఛార్జర్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీ, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కత్తానైట్‌రైడర్స్ తదితర టీంల విజయ అవకాశాలపై తమకు నచ్చినంత బెట్టింగ్‌లు కాస్తున్నారు. రూ.500ల మొదలుకుని పదివేల రూపాయల వరకు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిలపడిపోతున్నారు. అంతేకాకుండా కొందరు బెట్టింగ్‌రాయుళ్లు మధ్య వర్తిత్వం వహిస్తూ ఫోన్లలోనే ఈ బెట్టింగ్‌లు ఇరు వైపుల వారి నుంచి కాయిస్తూ తమకు అందినకాడికి దండుకుంటున్నట్లు సమాచారం. అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లు కాస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగాఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు స్పందించి బెట్టింగ్‌ను అరికట్టాల్సిందిగా పలువురు కోరుతున్నారు.కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మార్కెట్‌లోకి వస్త్తున్న ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు ఇవ్వాళ ఏ మారుమూల గ్రామాల్లో చూసినా యువత చేతుల్లో నిత్యవసర సరుకుగా మారుతోంది. అక్కడ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కావడమే ఆలస్యం.. ఇక యువకులు ఎక్కడ పడితే అక్కడే తమతమ సెల్‌ఫోన్‌లో మ్యాచ్‌ను ప్రత్యక్షప్రసారం వీక్షిస్తున్నారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇక్కడే యువతతోపాటు పెద్దవాళ్లు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్ క్రికెట్‌పై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నట్లు బాహాటంగానే వినిపిస్తోంది. మండలకేంద్రంతోపాటు కాళేశ్వరం, చుట్టు పక్కల గ్రామాల్లో కొద్ది రోజులుగా ఐపీఎల్ క్రికెట్‌పై యువకులు రూ.3000 నుంచి మొదలుకొని రూ.వేలల్లో బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్కంఠ భరిత వాతావరణంలో సాగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో ఎవరెవరు ఎక్కువ స్కోర్ చేస్తారు.. ఏ జట్టు గెలుస్తుందనే దానిపై సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని జోరుగా పందాలు కాస్తున్నారు. ఇదివరకంటే కేవలం నగరాలకే పరిమితమైన ఇలాంటి బెట్టింగ్‌లు ఇప్పుడు మారుమూల గ్రామాలకు కూడా విస్తరించడం గమనార్హం. సెల్‌ఫోన్‌లోనే ప్రత్యక్ష ప్రసారాలను వీక్షిస్తూ జరుగుతన్న ఈ బెట్టింగ్‌ల వల్ల ఇప్పటికే చాలా మంది జేబులకు చిల్లులు పడినట్లు తెలుస్తోంది. జూదం అలవాటు ఉన్న వ్యక్తులు కొందరు ఈ రకమైన జూదంను ఎంచుకొని నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కడో రహస్య ప్రాంతాల్లో ఇదివరకు పేకాట ఆడి చివరకు పోలీసులకు చిక్కిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  సరదాగా నలుగురు కలిసి సెల్‌ఫోన్‌లోనే మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు కాస్తుండటంతో రోజురోజుకూ భారీ మొత్తంలో నగదు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. వందల నుంచి మొదలుకొని వేలల్లో నడుస్తున్న ఈ బెట్టింగ్‌ల వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందంటున్నారు స్థానికులు.
Tags:Betting on IPL …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *