గెలుపు కోసం బెట్టింగ్ లు

Date:15/04/2019
విజయనగరం ముచ్చట్లు:
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో పందేల జోరు ఊపందుకుంది. అభ్యర్థుల విజయావకాశాలతో పాటు ఏపార్టీ అధికారంలోకి వస్తుంది, ఎన్ని సీట్లు సాధిస్తారు, ఒకవేళ విజయం సాధి స్తే అభ్యర్థుల ఆధిక్యమెంత.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ పందేలు కాస్తున్నారు.ఎన్నికలను ప్రధాన రాజకీయపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో క్షేత్రస్థాయిలోని పార్టీ కేడర్‌ అంతే కసిగా పనిచేసింది. ఎలాగైనా తమ పార్టీని గెలిపించుకోవాలని ఎత్తుకు, పైఎత్తులు వేస్తూనే ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. రాత్రిపూట ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. బూత్‌స్థాయి పోలింగ్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రధాన పక్షాలు దృష్టిసారించడంతో ఓటింగ్‌ శాతం అనూహ్యంగా పెరిగింది. పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ప్రతీ ఇంటి ఓటర్లను పరిగణనలోకి తీసుకుంటూ గ్రామ, మండలస్థాయిలో వచ్చే మెజార్టీపై  కౌంటింగ్‌కి ముందే ఒక అంచనాకు వస్తున్నారు. ఎవరికి వారు తమకే మెజార్టీ వస్తుందనే ధీమాతో గ్రామ, మండలస్థాయిలో వచ్చే ఆధిక్యంపై కూడా పందేలు కాస్తున్నారు. జిల్లాలోని విజయనగరం పట్టణంతో పాటు గజపతినగరం, పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి కేంద్రాలుగా బెట్టింగులు నిర్వహిస్తున్నారు.
అభ్యర్థుల ఖరారు, నామినేషన్‌ ప్రక్రి య ముగిసిన మరుక్షణం నుంచే వీరు రంగంలోకి దిగా రు. ఇప్పటికే కోట్లరూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. ఉత్కంఠ పోరులో ఎవరు విజయం సాధి స్తారనే విషయంలో రచ్చబండ వేదికలుగా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. పోలింగ్‌ నిశితంగా గమనిస్తూ రంగంలోకి దిగిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా పందేలు నిర్వహిస్తున్నారు. ఇరువర్గాల నడుమ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నందుకు పందెం డబ్బులలో 10 శాతం తీసుకుంటామని ముందే చెబుతూ పందేలు తీసుకుంటున్నారు.గతంలో అధికారంలోకి వచ్చే పార్టీ, విజయం సాధించే అభ్యర్థులపై మధ్యవర్తి సమక్షంలో పై పందేలు కాసేవా రు. ఆ సరదా కాస్తా వ్యసనంగా మారింది. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో తమ అవగాహనతో పాటు సర్వేలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు సామాన్యుల వరకు తమ ఆర్థిక పరిస్థితికి తగ్గట్లు పందేలు కాసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాలతో పాటు 9అసెంబ్లీ నియోజకవర్గాలపై విస్తృతంగా జరుగుతున్నాయి.
విజయనగరం పార్లమెంట్‌తో పాటు ప్రముఖులు పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాలపై ఎక్కువగా పందేలు కాస్తున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థుల గెలుపోటములపై, మరికొన్ని చోట్ల మెజార్టీపై కాస్తున్నారు. పోలింగ్‌ సరళి పరిగణనలోకి తీసుకుని వేసిన అంచనాతో కాస్తున్న పందేలకు ప్రాధాన్యతనిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమాతో ఉన్న వారు హెచ్చుపందేలు కాయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒక అభ్యర్థి విజయంపై కొందరు ప్రముఖులు రూ.లక్షకు అదనంగా రూ.10 వేలు ఇచ్చే ఒప్పందంతో హెచ్చు పందెం కాసినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో రూ.50 కోట్ల మేర చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది.వాస్తవంగా ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది ఓట్ల లెక్కింపు అనంతరం మాత్రమే తెలుస్తుంది. కొందరు ఆత్మవిశ్వాసం, తమ పార్టీపై ఉన్న అభిమానంతో అవగాహన మేరకు ముందస్తుగా అంచనా వేసుకుంటూ గుడ్డిగా పందేలు కాయడం పరిపాటిగా మారింది. ఎన్నికల జూదంలో ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం ఆర్థికంగా కుదేలవుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆస్తులు పొగొట్టుకుని ఆర్థికంగా చితికిపోయిన వారు ఉన్నారు. అప్పులు చేసి మరీ పందేలు కాస్తున్నారు. విద్యార్థులు, యువత, విద్యావంతులు, వ్యవసాయ కూలీలు కూడా వెనుకాడటం లేదు.
Tags: Betting s for winning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *