Natyam ad

భద్రాచలం… భద్రమేనా

ఖమ్మం ముచ్చట్లు:


1953లో గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. అప్పుడు సంభవించిన నష్టంపై సరైన స్పష్టత లేదు. కానీ.. అప్పటి పరిస్థితి గురించి తెలిసిన వారు అనేక భయానక విషయాలు చెబుతారు. ఆ తర్వాత మళ్లీ 1986లో గోదావరి వరదల బీభత్సాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు గోదావరికి ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఆస్తినష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భద్రాద్రి రాములోరి ఆలయంలోకి వరద నీరు వచ్చింది. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలు వరద నీటిలో చాలా రోజులు మగ్గాయి.ఆ తర్వాత దాదాపు 30 ఏళ్లు దాటాకా మళ్లీ గోదావరి వరదలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. వరద తగ్గినా.. అనేక గ్రామాలు ఇంకా తేరుకోలేదు. ఎంతోమంది సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తోంది. ఇక్కడిదాకా ఎలా ఉన్నా.. తాజాగా ఓ కొత్త వాదన.. భద్రాచలం  భద్రమేనా అన్న ప్రశ్న లేవనెత్తేలా చేస్తోంది. అదే పోలవరం బ్యాక్ వాటర్. ఈ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదంటూనే.. బ్యాక్ వాటర్ పై తెలంగాణ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

పోలవరం ప్రాజెక్టు పూర్తై.. నీటిని నిల్వ చేస్తే.. బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం సహా.. పినపాక, ములుగు నియోజకవర్గాల్లోని అనేక గ్రామాలు వరదల ధాటికి బలవుతాయని ఆరోపిస్తున్నారు.ఈ వాదనలపై ఏపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. భద్రాచలం  చుట్టుపక్కల వరదకు పోలవరం కారణమైతే.. మంచిర్యాలలో వచ్చిన వరదలకు కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భద్రాచలంపై భయం ఉంటే ఏపీలో కలపాలని సలహా ఇస్తున్నారు. దీనిపై తెలంగాణ నేతలు భగ్గుమన్నారు. తాము ఏపీలో విలీనం చేసిన 5 గ్రామాల గురించి మాట్లాడుతుంటే.. భద్రాచలాన్ని ఏపీలో కలపమనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో వరదలు వచ్చినా ప్రజలను కాపాడుకోవాలని తాము మాట్లాడుతుంటే.. విభజన అంశాలు తెరపైకి తేవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పోలవరం  ప్రాజెక్టు తమ పరిధిలో లేదని.. పూర్తిగా సీడబ్ల్యూసీ పరిధిలో ఉందని ఏపీ నేతలు చెబుతున్నారు. పూర్తి సర్వే జరిగాకే పోలవరం ఎత్తు పెంచామని అంటున్నారు.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా.. అసలు ఈ వరదల  సమస్యలకు పరిష్కారం ఏంటనేది ఇప్పుడు అసలు ప్రశ్న.

 

 

 

Post Midle

అయితే.. వరద బాధితులు ఏపీలో ఉన్నా.. తెలంగాణలో ఉన్నా.. వారందరు తెలుగు ప్రజలు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం అయినా.. భద్రాచలం  సహా.. ముంపు ప్రాంతాల్లో కరకట్ట నిర్మించడం కోసమైనా ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేయాలి. రెండు రాష్ట్రాలు ఒక అభిప్రాయానికి వచ్చి.. కేంద్రం వద్ద ప్రతిపాదన పెట్టాలి. ఇలాంటి వరదలు భవిష్యత్తులో భద్రాచలం భద్రంగా ఉండేలా చూడాలి.పోలవరం  ప్రాజెక్టు వల్ల ఏపీ ప్రజలకు కలిగే లాభాలు తగ్గకుండా.. తెలంగాణ ప్రజలు ముంపు బారిన పడకుండా పరిష్కార మార్గం చూపాలి. అప్పుడే భద్రాచలం భద్రంగా ఉంటుంది. ముంపు ప్రాంతాల ప్రజలకు వరద తిప్పలు తప్పుతాయి. అంతేకానీ.. వరదలు వచ్చినప్పుడల్లా విభజన సమస్యలను తెరపైకి తేవడం ఎవ్వరికీ మంచిది కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎలాగూ ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో మాదిరిగా ఇద్దరు ప్రభుత్వాధినేతలు ఓసారి కూర్చొని చర్చించుకొని.. సమస్యలకు పరిష్కారం వెతకాలని ముంపు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

 

Tags: Bhadrachalam… Bhadramena

Post Midle