భగ్గుమంటున్న భానుడు
రాజమండ్రి ముచ్చట్లు:
భగ్గుమంటోన్న భానుడి ప్రభావంతో.. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పదిసార్లు జనం ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఇప్పటికే నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పగటిపూటే కాదు.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వడగాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది. భానుడి ప్రతాపంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత దాదాపుగా 46 డిగ్రీలను దాటిపోయింది. ప్రకాశం 46, ఏలూరు, విజయవాడలో 47, గుంటూరులలో 48 డిగ్రీలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల టెంపరేచర్లు నమోదు అయినట్లు వెల్లడించింది.ఇక వడదెబ్బతో ఏపీలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. వడదెబ్బ తగిలి పలువురు ఆస్పత్రిపాలయ్యారు. పరిస్థితి మరో మూడురోజులు ఇలాగే ఉంటుందని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో హెపటైటిస్-బీ ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు తెలిపారు. బయటకు వెళ్లేవాళ్లు తలకు రక్షణ ధరించాలి, మంచినీళ్లు, సహజ సిద్ధమైన పానీయాలు, ఓఆర్‌ఎస్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ ను తీసుకెళ్లడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సుదీర్ఘ ప్రయాణాలకు క్యూ
ఎండలు సెగ పుట్టిస్తున్నాయి. ఫ్యాన్ కింద కూర్చున్నా ఉక్కపోతే. ఏసీ వేసుకుంటే కొంతసేపే చల్లదనం. పగలంతా ఇదే తీరు. సాయంత్రం సరదాగా నాలుగడుగులు బయటకు వేద్దామంటే భగ్గుమనే వేడిగాలులు… ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గర వేసవి సెలవుల్ని ఏం ఎంజాయ్ చేస్తామంటూ.. సుదీర్ఘ ప్రయాణాలకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వేసవి ట్రిప్‌లను చూస్తే కరోనా మునుపటి స్థితిని అధిగమించేలా కనిపిస్తున్నాయని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ థామస్ కుక్ (ఇండియా), ఎస్‌ఓటీసీ ట్రావెల్ విడుదల చేసిన ‘ఇండియా హాలిడే రిపోర్ట్–మే 2023’ వెల్లడించింది.పర్యాటకుల ప్రయాణాలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండటంతో ఎక్కువ ఖర్చు పెట్టి విదేశాలకు కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మెజార్టీ ప్రజలు సులభంగా ప్రయాణ వీసాలు పొందే దేశాలకే మొగ్గు చూపుతున్నారు.
భారతీయులకు అత్యంత ఇష్టమైన విదేశీ వేసవి విడిది ప్రాంతంగా యూరప్ అగ్రస్థానంలో నిలుస్తోంది. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ దేశాలు ప్రాధాన్య గమ్యస్థానాలుగా ఎక్కువ ట్రావెల్ బుకింగ్‌లు చేస్తున్నారు.సుదూర ప్రయాణాలకు సమయం వెచ్చించలేని పర్యాటకులు థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, దుబాయ్, అబుదాబి, ఒమన్‌తో పాటు మాల్దీవులు, మారిషస్ వంటి ద్వీపాల్లో సేద తీరేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కొత్తగా జపాన్, దక్షిణ కొరియా పర్యటనలపై కూడా ఆసక్తి పెరిగినట్టు సర్వే నివేదిక చెబుతోంది. విచిత్రంగా అమెరికా కంటే ట్రావెల్ బుకింగ్‌లలో 20 శాతం అధికంగా ఆస్ట్రేలియాకు ఉంటున్నాయి. వీసాలు పొందడంలో ఇబ్బందుల ఫలితంగా అమెరికాకు ట్రావెల్ బుకింగ్‌లలో తగ్గుదల కనిపిస్తోంది.
Tags: Bhaggumanta Bhanu
