Natyam ad

భగ్గుమంటున్న కమలం వర్గపోరు

నిజామాబాద్ ముచ్చట్లు:


నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బీజేపీలో చాపకింద నీరులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది. ఇక్కడ పార్టీ ఇంఛార్జ్‌ రుయ్యాడి రాజేశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణ తనయుడు మల్లికార్జునరెడ్డి మధ్య అస్సలు పొసగడం లేదు. పార్టీ కేడర్‌ కూడా కొత్త, పాత అని చీలిపోయింది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభ తర్వాత ఆ పోరు మరింత శ్రుతిమించినట్టు టాక్‌. ప్రధాని సభకు రాజేశ్వర్ కొందరిని తీసుకెళ్లారు. వారికి ఆరెంజ్‌ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి గ్యారేజీలో భోజనం పెట్టించారట. ఈ విషయాన్ని మల్లికార్జున్ రెడ్డి.. పార్టీ దృష్టికి తీసుకెళ్లడంతో.. షోకాజ్‌ నోటీసులు జారీ చేశారట. ఆ నోటీసే బాల్కొండ బీజేపీలో అగ్గి రాజేస్తోంది.జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎలా షోకాజ్‌ నోటీసు ఇస్తారని ప్రశ్నిస్తూ.. రాజేశ్వర్‌ వర్గం తిరుగుబాటుకు రెడీ అవుతోందట. ప్రస్తుతం రెండు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. మల్లికార్జునరెడ్డికి బీజేపీలో ఒక ముఖ్యనేత మద్దతు ఉందని.. అందుకే పాత కేడర్‌ను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలకు చెప్పేందుకు పాత నేతలు రెడీ అవుతున్నారట. గతంలో మల్లికార్జునరెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల ఆడియోలను వైరల్‌ చేస్తున్నారట.టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి మల్లికార్జునరెడ్డి తానే అభ్యర్థిననే ప్రచారం మొదలు పెట్టారు. ఆ మేరకు పార్టీలో హామీ లభించిందని చర్చలో పెడుతున్నారు.

 

 

గతంలో బీఎస్పీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత సునీల్‌రెడ్డి.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆయన రాకను మల్లికార్జునరెడ్డి, జిల్లాలో మరో నేత అడ్డుకుంటున్నారట. సునీల్ రెడ్డి రెండుసార్లు బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైనా.. చివరి నిమిషంలో క్యాన్సిల్‌ అయ్యిందట.ఇదే సమయంలో ఆరెంజ్‌ ట్రావెల్స్ గ్యారేజీలో భోజనాలు చేయడం వివాదానికి కారణమైంది. బాల్కొండ నుంచి రెండుసార్లు బీజేపీ నుంచి పోటీ చేసిన రాజేశ్వర్‌ను సాగనంపే కుట్రలు చేస్తున్నారని ఆయన వర్గం అనుమానిస్తోంది. దీనిపైనే రెండువర్గాలు సోషల్ మీడియాలో విమర్శలు చేసుకుంటున్నాయి. సమస్య వేడి హైదరాబాద్‌ వరకు తాకిందట. బాల్కొండ పరిణామాలపై రాష్ట్ర నేతలు ఆరా తీసినట్టు తెలుస్తోంది. వివాదాలకు, విభేదాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. అయితే ఆ హెచ్చరికలు చెవికి ఎక్కలేదో ఏమో.. కయ్యానికి కాలు దువ్వడానికి వెనకాడటం లేదు స్థానిక బీజేపీ నేతలు. మరి.. వర్గపోరుకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర నేతలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.

 

Post Midle

Tags: Bhaggumanta Kamalam Vargaporu

Post Midle