భవిత ప్రశ్నార్ధకం  

Date:08/11/2018
విజయనగరం ముచ్చట్లు:
ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రత్యేక బోధనా విధానం నిర్లక్ష్యానికి గురవుతుంది. దీంతో ప్రత్యేకావసరాల చిన్నారులు దానిపై ఆసక్తి చూపడం లేదు. మరోవైపు బోధన కోసం కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన పరికరాలు, నిర్మించిన భవనాలు అలంకార ప్రాయంగా మారాయి. వారి కోసం నియమించిన ఉపాధ్యాయులను సైతం వేరే అవసరాలకు వినియోగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పిల్లలకు చికిత్స చేయాల్సిన ఫిజీషియన్‌ పోస్టులు భర్తీ చేయకపోవడం, పర్యవేక్షణ కొరవడడంతో ఈ కేంద్రాల భవిత అగమ్యగోచరంగా ఉంది.జిల్లాలో సర్వశిక్షాభియాన్‌ ద్వారా మానసిక, శారీరక వికలాంగులైన చిన్నారులు దైనందిక కార్యక్రమాలను స్వయంగా నిర్వహించుకునేలా తర్ఫీదు ఇచ్చేందుకు 12 భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 6 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు శిక్షణ ఇచ్చేందుకు మండలానికి ఇద్దరేసి చొప్పున ఐఈఆర్టీలు నియమించారు.
జిల్లాల్లో 34 మండలాలను కలుపుతూ 12 భవిత, 12 నాన్‌ భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 5 రకాల ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు 546 మంది ఈ కేంద్రాల్లో అభ్యన పొందుతున్నారు. గతేడాది చివర్లో ‘సహిత’ పేరుతో నిర్వహించిన సర్వేలో 6,923 మంది ప్రత్యేక అవసరాల చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. కానీ సర్వే చేయడంలో చూపిన శ్రద్ధ వారిని భవిత కేంద్రాల్లో చేర్పించడంలో చూపలేదు. తాజా నమోదులో కేవలం 546 మంది మాత్రమే ఉండడంపై వాటి సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థమవుతుంది.
ఐఈఆర్టీలు చిన్నారులతో ఆక్షరాలు దిద్దించడం, ఆటలు నేర్పించడం వంటివి చేయాలి. ఇందుకు అవసరమైన ఆట వస్తువులు కూడా సర్వశిక్షా అభియాన్‌ ద్వారా సరఫరా చేశారు.
జిల్లాలోని 34 మండలాల పరిధిలోని 12 భవిత, 12 నాన్‌ భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఫిజియోథెరిపీ చికిత్సలు ఇతరల సేవలు అందించడానికి 9 మంది ఫిజీషియన్‌ వైద్యుల అవసరం ఉంది. ప్రస్తుతం 5 మంది మాత్రమే భవిత కేంద్రాల పరిధిలోని చిన్నారులకు సేవలు అందిస్తున్నారు.
అన్ని కేంద్రాల్లో ఫిజియోథెరిపీ సేవలు అందిస్తున్నట్లు నివేదికలు చూపి నిధులు డ్రా చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  ప్రత్యేక అవసరాల చిన్నారులకు వ్యాయామం, విద్య అందించేందుకు జిల్లాలోని 12 భవిత కేంద్రాల్లో పదేసి లక్షల వ్యయంతో నిర్మించిన భవనాలు, చిన్నారుల హాజరుశాతం పడిపోవడంతో పరికరాలు నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు విద్యను బోధించటానికి మండలానికి ఇద్దరేసి చొప్పున ఐఈఆర్టీలను నియమించాలి. జిల్లాలో ఇంకా ఐదు ఐఈఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కేంద్రాలు ప్రారంభించిన తొలినాళ్లలో మానసిక, శారీరక వికలాంగులైన చిన్నారులకు కేంద్రాల్లో చక్కటి సేవలు అందాయి. వైద్య పరీక్షలు, వ్యాయామం, బోధన జరిగింది. తొలుత గ్రామాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పిల్లల హాజరు శాతం తగ్గడంతో మండల కేంద్రాలకు తరలించారు. దీంతో ప్రత్యేకావసరాల పిల్లల తల్లిదండ్రులు వారిని తీసుకొచ్చేందుకు ఇష్టపడడం లేదు.
అధికారుల లెక్కల ప్రకారం 6,600 మంది ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఉన్నా, కేవలం 546 మందికి మాత్రమే సేవలందిస్తున్నారంటే ఆ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఐఈఆర్టీలను ఇతర పనులకు వినియోగించడం కూడా ప్రస్తుత ఈ పరిస్థితి కారణం.
Tags: Bhavya Questionnaire

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *