మరాఠలో బీహార్ ఫార్ములా

Date:12/11/2019

ముంబై  ముచ్చట్లు:

లౌకిక పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీ శివసేనకు మద్దతిచ్చేందుకు తర్జన భర్జన పడింది. పక్కా హిందుత్వ పార్టీ అయిన శివసేనకు మద్దతు ఇస్తే దేశ వ్యాప్తంగా పార్టీపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సీనియర్ నేతలతో చర్చించారు. మరోవైపు ఎన్సీపీ మాత్రం కాంగ్రెస్ తో ముడిపెట్టింది. కాంగ్రెస్ మద్దతిస్తే తాము శివసేనకు మద్దతిచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. చివరకు కాంగ్రెస్ బయట నుంచి మద్దతివ్వాలని నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను చూస్తుంటే బీహార్ పరిణామాలు గుర్తుకు రాక మానవు. బీహార్ లోనూ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆర్జేడీ, జనతాదల్ యు కలసి మహాగడ్బంధన్ గా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ బంధాన్ని తెలివిగా విడగొట్టగలిగింది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి కేసులను బనాయించి నితీష్ కుమార్ ను దూరం చేసింది. దీంతో నితీష్ కుమార్ చివరకు బీజేపీ శరణొచ్చాల్సి వచ్చింది.ఇక్కడ శివసేన కూడా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది కొంతకాలమేనంటున్నారు విశ్లేషకులు. ఎన్సీపీ నేతలపై ఇప్పటికే ఈడీ కేసులు నమోదయి ఉన్నాయి. శివసేనను, ఎన్సీపీని విడగొట్టడం బీజేపీకి అంత కష్టమైన పని కానే కాదంటున్నారు. ఆర్జేడీ, జేడీయూలాగానే మహారాష్ట్రలో కూడా బీహార్ ఫార్ములాను అమలు చేయవచ్చన్నది కమలనాధుల వ్యూహంగా కన్పిస్తుంది. అయితే మహారాష్ట్రలో బీహార్ తరహాలో సీఎం పదవి అప్పగించే అవకాశాలుండవు. కొంతకాలం ఓపిక పడితే తిరిగి తాము అధికారంలోకి రావచ్చన్నది బీజేపీ ఆలోచన.శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసినా నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. శివసేన, ఎన్సీపీలు కామన్ మినిమం ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుని పాలనలోకి దిగినా పదవుల పంపకాల్లో అసంతృప్తి తప్పకుండా రగులుకుంటుందన్న అంచనాలో బీజేపీ ఉంది. అందుకే మౌనంగా గమనిస్తూ ఉండాలని నిర్ణయించుకుంది. కర్ణాటకలోనూ ఇదే తరహా ఫార్ములాను అమలు చేసి బీజేపీ సక్సెస్ అయింది. అందుకే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తొందరపడకుండా శివసేనకు ఛాన్సిచ్చింది.

 

యడ్డీతో భేటీకి అమిత్ షా ఇష్టపడటం లేదు

 

Tags:Bihar Formula in Maratha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *