బీమా..భరోసా..

Date:12/03/2018
కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లాలో పదిరోజుల వ్యవధిలోనే ఇద్దరు కల్లుగీత కార్మికులు చెట్లపై నుండి జారిపడి మృతి చెందారు. దీంతో గీతకార్మికుల సంక్షేమంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చెట్లపై నుంచి జారిపోతే సాధారణంగా తీవ్రగాయాలవుతాయి. బాధితులు ఇకపై కల్లుగీసే అవకాశమూ కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం అందించే సహకారం గురించి అంతా ఆరా తీస్తున్నారు. కార్మికుల కుటుంబాలకు మద్దతుగా ఉండే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ  చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందిన గీతకార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తోంది. గతేడాది వరకు ఇది రూ.2 లక్షలుగా ఉండేది. కార్మికుల కుటుంబాల కష్టనష్టాలు గుర్తించి ఈ మొత్తాన్ని పెంచారు. ఇదిలా ఉంటే గాయపడ్డవారికి రూ.10 వేలు, ఏ పనీ చేసుకోనంతగా అంగవైకల్యం కలిగితే గతేడాది వరకు రూ.50 వేల చొప్పున చెల్లించే ఏర్పాటు ఉంది. శాశ్వత వైకల్యాన్ని అధికారుల బృందం ఖరారు చేస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తారు. ఏ సాయం పొందేందుకైనా గీతకార్మిక సంఘంలో సభ్యుడై ఉండి గుర్తింపుకార్డు కలిగి ఉండటం తప్పనిసరి.గీతకార్మికులకు బీమా పథకాలు కూడా భరోసాగా ఉంటాయని గీతకార్మిక సంఘం నాయకులు అంటున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకుంటే, వృత్తి నిర్వహణలో వైకల్యం కలిగినా, మరేదైనా జరిగినా కుటుంబానికి అందే సాయం కొండంత ధీమాగా ఉంటుందని చెప్తున్నారు. గీతకార్మిక సంఘంలో తప్పనిసరిగా సభ్యుడై ఉంటేనే ప్రభుత్వం అందించే పరిహారానికి అర్హత సాధిస్తారు. గ్రామంలో సంఘం లేకున్నా, 11 మంది సభ్యులుంటే వారు కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. వివిధ బ్యాంకులు కనీస ప్రీమియంతో ప్రధానమంత్రి బీమా యోజన, ఇతరత్రా పథకాల్లో 2 లక్షలవరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఎలాంటి ప్రీమియం చెల్లించనక్కర్లేని ఖాతాలు తీసుకుంటే బీమా వర్తించేవీ ఉన్నాయి. ఇలాంటి పథకాలు కార్మికుల కుటుంబాలకు కొండంత అండగా ఉంటాయి. వైద్యం ఖర్చులకూ ఆర్ధిక సహాయం అందించే పాలసీలు ఉన్నాయి. గీతకార్మికులు ప్రమాదాల బారిన పడినపుడు శాసనసభ్యుల ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే చికిత్సకు ముందుగానే ముఖ్యమంత్రి కార్యాలయం నిధులు మంజూరు చేస్తుంది. ముందుగానే చికిత్స చేయించుకుని ఆ తర్వాత రసీదులతో దరఖాస్తు చేసుకుంటే వైద్యానికి అయిన ఖర్చుల్లో 80 శాతం వరకు ఆర్థిక సాయం అందిస్తారు. అంతేకాక ప్రమాదంలో మృతి చెందిన గీతకార్మికుల కుటుంబాలకు ఆపద్బంధు పథకం అండగా ఉంటుంది.
Tags: Bimabharosa ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *