-పుట్టినరోజే ప్రమాదంలో యువకుడు మృతి
పుంగనూరు ముచ్చట్లు:
పుట్టినరోజు….మరణించిన రోజు ఒకే రోజు కావడంతో ఆకుటుంబం విషాదంలో మునిగిపోయింది. 22 ఏళ్ళ వయసు కలిగిన యువకుడు పుట్టినరోజు వేడుకలు చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మృత్యువు వెంబడించి కబలించిన విషాదకర సంఘటన పట్టణంలోని గోకుల్ సర్కిల్‌లో శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఎన్.ఎస్.పేటకు చెందిన నారాయణ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇతని కుమారుడు వేణుప్రసాద్ (22) ఐస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఇలా ఉండగా తన పుట్టిన రోజు వేడుకలను స్నేహితులతో కలసి జరుపుకునేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలోని గోకుల్ సర్కిల్ వద్దకు ద్విచక్రవాహనంపై రాగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వేణుప్రసాద్ తల పగిలిపోయి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటనతో పట్టణంలో విషాదం నెలకొంది. పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం వివరాలను సేకరిస్తున్నారు.
Tags: Birth and death on the same day – Tragedy in Punganur