‘బిట్‌కాయిన్‌’ కు బ్యాంకులు షాక్‌

Bitcoin Banks Suspended exchanges banks accounts

Bitcoin Banks Suspended exchanges banks accounts

సాక్షి

Date :20/01/2018

సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా  సంచలన వార్తల్లో నిలిచిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ ట్రేడర్లకు  మరో షాక్‌ తగిలింది. దేశీయ టాప్‌ బ్యాంకులు ప్రధాన ఎక్స్చేంజీలలో  బిట్‌కాయిన్‌ ఖాతాలను  సస్పెండ్‌ చేసినట్టు తెలుస్తోంది.  జెబ్‌ పే, యనోకాయిన్‌, కాయన్‌ సెక్యూర్‌, బీటీసీఎక్స్‌ ఇండియా  తదితర టాప్‌ టెన్‌ ఎక్స్ఛేంజీలపై దృష్టిపెట్టాయి. ఈ వ్యవహారంతో  సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా  బిట్‌కాయిన్‌ ఖాతాలను నిలిపివేసిన సమాచారం తెలుస్తోందని ఎకనామిక్స్‌  టైమ్స్‌  రిపోర్ట్‌ చేసింది. అనుమానాస్పద  లావాదేవీలు భారీగా జరిగాయన్న సందేహాల నేపథ్యంలో  బ్యాంకులు సంబంధిత  చర్యలకు  దిగాయని పేర్కొంది.

ఎక్స్చేంజీల ద్వారా నిర్వహిస్తున్న అనేక ఖాతాలను, లావాదేవీలను  దేశంలోని అగ్ర బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసిఐసిఐ, యస్ బ్యాంక్‌తో  సహా కొన్ని ఇతర టాప్‌ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.  దీంతోపాటు ఎక్స్చేంజీల ప్రమోటర్ల నుండి  సంబంధిత వివరాలను కోరినట్టు కీలక వర్గాల సమాచారం. నగదు ఉపసంహరణలు నిలిపివేసిన కొన్ని ఖాతాల్లో  ఇంకా  లావాదేవీలు చోటుచేసుకోవడంతో గత నెలరోజులుగా 1:1 రేషియోతో  సంబంధిత అదనపు సమాచారాన్ని సేకరిస్తోందని తెలిపాయి. భారతదేశంలో టాప్‌ టెన్‌ ఎక్స్ఛేంజీల  మొత్తం ఆదాయం సుమారు 40వేల కోట్ల రూపాయలు ఉండవచ్చునని అంచనా. రిజర్వ్‌  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానుంచి  ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ,  ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నాయి.

అయితే ఈ నివేదికలపై  బ్యాంకులు ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు  బ్యాంకులనుంచి తమకు అలాంటి సమాచారమేమీలేదని, సంబంధిత చర్యల గురించి బ్యాంకులు లేదా ప్రమోటర్లు తమను సంప్రదించ లేదని  యునికోయిన్ ప్రమోటర్ సాత్విక్ విశ్వనాథ్ చెప్పారు.

కాగా బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌పై ఆదాయపన్ను శాఖ  ఇప్పటికే   స్పందించింది.  పన్నులు చెల్లించాల్సింది వేలమందికి నోటీసులు పంపించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో 17 నెలల కాలంలోనే 3.5 బిలియన్‌ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *