బీజేపీ… దూకుడు

Date:18/09/2020

విజ‌య‌వాడ‌ ముచ్చట్లు:

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అస‌లైన ప్ర‌తిప‌క్షంగా తామే ఉంటామ‌ని చెబుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ అదే దూకుడుతో వెళుతోంది. తెలుగుదేశం పార్టీని వెన‌క్కు నెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తామే ప్ర‌త్యామ్నాయం కావాల‌ని ఉవ్విళ్లూరుతున్నా బీజేపీ ఇందుకు త‌గ్గ‌ట్లుగానే పావులు క‌దుపుతోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేతగా క్షేత్ర‌స్థాయిలో వివిధ అంశాల‌పై ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌వాల్సిన చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అతిథిలా మార‌డాన్ని బీజేపీ బాగా స‌ద్వినియోగం చేసుకుంటోంది. గ‌త కొన్ని రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే తెలుగుదేశం పార్టీ క‌న్నా బీజేపీనే ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లో ఉంటోంది.చంద్ర‌బాబు త‌న సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ ప్ర‌జ‌ల్లోనే ఉండేందుకు ప్ర‌య‌త్నించారు. ముఖ్య‌మంత్రిగా ఉన్నా, ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నా ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి ఎక్కువ‌గా వెళ్లేవారు. 2014 నుంచి 2019 వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనూ నిత్యం ఏదో ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌ను క‌లిసేవారు. అటువంటి చంద్ర‌బాబు ఇప్పుడు పూర్తిగా ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యారు. అధికారంలో ఉన్న‌న్ని రోజులూ అమ‌రావ‌తిలో ఉన్న చంద్ర‌బాబు అధికారం కోల్పోయాక హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చారు. అప్ప‌టినుంచి చుట్ట‌పు చూపుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తూ వెళుతున్నారు.ఇక గ‌త మార్చ్ నుంచి ఆయ‌న పూర్తిగా రాష్ట్రానికి దూర‌మ‌య్యారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌లైన నాటి నుంచి ఆయ‌న హైద‌రాబాద్‌లోని త‌న ఇంటిని విడిచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇంత పెద్ద విప‌త్తు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భుత్వం ఎంత చేసినా ఇంకా ఎన్నో లోపాలు ఉంటాయి. ఈ లోపాల ప‌ట్ల పోరాడాల్సిన బాధ్య‌త ప్ర‌తిప‌క్ష నేత‌కు ఉంటుంది. క్షేత్ర‌స్థాయిలో తిరిగి క‌రోనా నివార‌ణ చ‌ర్య‌లు, బాధితుల‌కు అందుతున్న వైద్యం, ఇత‌ర స‌మ‌స్య‌లు తెలుసుకొని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాల్సి ఉంటుంది. కానీ, చంద్ర‌బాబు ఇవేమీ చేయ‌డం లేదు.కేవ‌లం ఆయ‌న రోజుకో ట్వీట్ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల‌కు ఒక‌సారి జూమ్ ద్వారా త‌న ఇంట్లో నుంచే ప్రెస్ మీట్ పెట్టి ఊరుకుంటున్నారు.

 

క్షేత్ర‌స్థాయిలో తిర‌గ‌కుండా, హైద‌రాబాద్‌లోనే ఉంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌రిస్థితుల‌పై ఆయ‌న మాట్లాడితే పెద్దగా విలువ ఉండ‌దు. బ‌హుశా చంద్ర‌బాబు నాయుడు వ‌య‌స్సురీత్యా ఆయ‌న క‌రోనా జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా బ‌య‌ట‌కు రావ‌డం మానుకున్నారేమో. కానీ, టీడీపీలో నెంబ‌ర్ 2గా, భ‌విష్య‌త్ నేత‌గా ఉన్న నారా లోకేష్ అయినా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉంటూ క్షేత్ర‌స్థాయిలో ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఆయ‌న కూడా ఈ ప‌ని చేయ‌డం లేదు.క‌నీసం ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డం ప్ర‌తిప‌క్షాలు చేసే ప‌ని. కానీ, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌లో భారీ ప్ర‌మాదాలు జ‌రిగినా క్ష‌తగాత్రుల‌ను, మృతుల కుటుంబాల‌ను చంద్ర‌బాబు, లోకేష్ క‌నీసం క‌ల‌వ‌లేదు. ప్ర‌భుత్వం తీసుకుంటున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు, ప‌థ‌కాల అమ‌లులో లోపాలను తెలుసుకోవ‌డం, వాటిని ప్ర‌శ్నించ‌డం, ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వెన‌క‌బ‌డిపోయింది. కేవ‌లం ట్విట్ట‌ర్‌, జూమ్‌కే చంద్రబాబు నాయుడు, లోకేష్ ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఈ విష‌యంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌ల్లోనూ అసంతృప్తి ఉంది.చంద్ర‌బాబు, లోకేష్ రాష్ట్రంలో అందుబాటులో లేక‌పోవ‌డం బీజేపీకి బాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. ఆ పార్టీ కొత్త రాష్ట్రాధ్య‌క్షుడు సోము వీర్రాజు దూకుడుగా వెళుతున్నారు.

 

వివిధ అంశాల్లో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డంలో బీజేపీనే టీడీపీ కంటే ముందుంటోంది. టీడీపీ లాగా ట్విట్ట‌ర్‌లో కాకుండా ఫీల్డ్‌లోకి వెళుతోంది బీజేపీ. అంత‌ర్వేది ర‌థ ద‌గ్ధం వంటి సంఘ‌ట‌న‌ల్లో బీజేపీ క్షేత్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు చేస్తే టీడీపీ ఆన్‌లైన్ ఆరోప‌ణ‌ల‌కే ప‌రిమిత‌మైంది. దుర్గ‌గుడి ర‌థం వెండి సింహాలు మాయ‌మైన విష‌యం తెలియ‌గానే సోము వీర్రాజు అక్క‌డ వాలిపోయారు. కానీ, చంద్ర‌బాబు సాయంత్రం జూమ్‌లోకి వ‌చ్చి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు.క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఇప్ప‌ట్లో త‌గ్గిపోయేది కాదు. క‌రోనా ఉన్న‌న్ని రోజులూ హైద‌రాబాద్‌కే చంద్ర‌బాబు ప‌రిమితం కావాల‌ని అనుకుంటే క‌నీసం నారా లోకేష్‌ను అయినా రంగంలోకి దించాలి. నిజానికి ఈ స‌మ‌యంలో లోకేష్ క్షేత్ర‌స్థాయిలో క‌నిపిస్తే ఆయ‌న రాజ‌కీయంగా ఎదిగేందుకు, ప్ర‌జ‌ల్లో ఆయ‌న ప‌ట్ల సానుకూల‌త పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ, చంద్ర‌బాబు, లోకేష్ ఈ ప‌ని చేయ‌డం లేదు. ఇలానే కొన‌సాగితే బీజేపీ – జ‌న‌సేన కూట‌మి టీడీపీని వెన‌క్కు నెట్టే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉండ‌వ‌చ్చు.

పత్తిపాటి..రాజీ ఒప్పందం…

Tags:BJP … aggressive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *