Natyam ad

జనసేన పార్టీతో బీజేపీ మైత్రి లవ్ అండ్ హేట్

విజయవాడ ముచ్చట్లు:


పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో బీజేపీ మైత్రి లవ్ అండ్ హేట్ చందంగా కొనసాగుతోంది. ప్రసిద్ధ కథా రచయత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్ర కథ యావజ్జీవం హోష్యామీలో నిత్యం గొడవపడుతూ కలిసి జీవించే దంపతుల్లా జనసేన, బీజేపీ మైత్రి కొనసాగుతోంది. ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతున్న కొద్దీ ఈ రెండు పార్టీల మధ్యా మైత్రి రంగులు మార్చుకుంటోంది. తగవులు పడుతోంది.. కలిసి సాగుదాం అంటోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను అంగీకరించాలని బీజేపీతో మైత్రికి జనసేనాని షరతు పెడితే.. మా పార్టీ ఎవరినీ భుజాన మోయదని బీజేపీ బెట్టు చేస్తున్నది.ప్రధాని నరేంద్రమోడీ హాజరైన భీమవరం సభకు జనసేనానిని నువ్వు రావద్దుసుమా అని నోటితో చెబుతూ సభకు రావాలంటూ ఓ ఆహ్వానం పడేసింది బీజేపీ.. అలిగిన జనసేనాని ఆ సభకు దూరంగా ఉండిపోయారు.

 

 

 

ఆ తరువాత మేం ఆహ్వానించాం మీరే రాలేదంటూ బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కితే.. వద్దామనే అనుకున్నా, కానీ స్థానిక ఎంపీని ఆహ్వానించకుండా నన్న ఆహ్వానించడం, నేను రావడం మర్యాద కాదని దూరంగా ఉన్నానని జనసేనాని వివరణ ఇచ్చారు. సరే అది ముగిసిన కథ.. ఇప్పుడు మళ్లీ ఈ ఆహ్వానం కథే మరో చోట మరోలా ఆరంభమైంది.  ఆ కథేమిటంటే  పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు  కేంద్రం పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ప్రొటో కాల్ ప్రకారం పవన్ ను ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఉప రాష్ట్రపతి, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు మాత్రమే ఆహ్వానితుల జాబితాలో ఉంటారు. అయినా కూడా పెద్ద మనసు చేసుకుని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు జనసేనాని పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానించి తప్పని సరిగా రావాలని కోరారు.దీనిని బట్టి పవన్ ను బీజేపీ దూరం పెట్టే ప్రశక్తే లేదనీ, వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలూ కలిసే పోటీ చేస్తాయని విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే తనకు ఆహ్వానం వచ్చిందని ధృవీకరించిన పవన్ కల్యాణ్ ఆ ఆహ్వానాన్ని అనివార్య కారణాల వల్ల మన్నించలేకపోతున్నానని చెప్పేశారు. ఆరోగ్యం బాలేదనీ, అందుకే వెళ్లడం లేదనీ చెబుతూ,

 

 

 

పనిలో పనిగా రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా తన పదవీ కాలంలో క్రియాశీలంగా వ్యవహరించారనీ, పదవికి వన్నెతెచ్చారని ప్రశంసించేశారు. అయితే ఇంతకీ మోడీ స్వయంగా ఆహ్వానించినా పవన్ ఎందుకు స్పందించడం లేదు అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి బీజేపీ, జనసేన మధ్య మూడేళ్లుగా మైత్రి కొనసాగుతున్నా.. ఈ మూడేళ్లలో కేవలం ఒక్కటంటే ఒక్క సారి మాత్రమే పవన్ కల్యాణ్ మోడీతో భేటీ అయ్యారు.ఈ మధ్య కాలంలో పలు మార్లు మోడీతో భేటీ అవకాశం కలిగినా, స్వయంగా మోడీయే పిలిచినా పవన్ కల్యాణ్ ఆయనను కలిసే యత్నం చేయలేదు.   విశాఖ స్టీలు ప్లాంట్ ఇష్యూలో పవన్ నేరుగా హోం మంత్రి అమిత్ షానే కలిశారు. స్టీల్ ప్లాంట్ స్థితిగతులపై చర్చించారు. పలు సందర్భాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా కలిశారు. కానీ ఇంతవరకూ ప్రధాని మోదీని మాత్రం కలవలేదు.  ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తులు చిగురిస్తున్నట్టు వస్తున్న వార్తల వేళ.. పవన్ రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు సభకు గైర్హాజర్ కావాలని తీసుకున్న నిర్ణయం పలు సందేహాలకు తావిస్తున్నది. ఒక వైపు బీజేపీ  2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేస్తామని   గంటా పథంగా చెబుతూ వస్తోంది.అయితే పవన్ మాత్రం మరో ఉద్దేశంలో ఉన్నట్లు తన మాటలు,

 

 

 

చేతల ద్వారా స్పష్ఠంగానే తెలియజేస్తున్నారు.   గత రెండు సార్లు తాను తగ్గానని.. ఇక   తనకు ఈసారి అవకాశాన్ని వదిలేయాలని ఆయన సూటిగా కాకపోయినా పరోక్షంగానైనా బీజేపీకి తెలియజేశారు. అదే సమయంలో తెలుగుదేశానికి అన్యాపదేశంగా అదే సూచన చేశారు. దీంతో జనసేనతో పొత్తు అన్న విషయంలో తెలుగుదేశం ఆచి తూచి అడుగేస్తోంది. పొత్తు ఉంటుందని కానీ ఉండదని కానీ చెప్పడం లేదు. అయినా  మహానాడు తరువాత ఆ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపించింది. పవన్ ప్రస్తావనే లేకుండా తన పని తాను చేసుకుని పోతోంది.  బీజేపీ కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన సందర్భంగా పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని జనసేన శ్రేణుల నుంచి డిమాండ్ ను పట్టించకోకపోవడం అటుంచి, ఆయన పర్యటన మొత్తంలో కనీసం జనసేన పేరును కానీ, పవన్ కల్యాణ్ ఊసు కానీ రానీయ లేదు.  అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో బీజేపీ పునరాలోచనలో పడి జనసేనకు అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే జనసేనానికి ఆహ్వానాలు, తెలుగుదేశం పార్టీతో వేదిక పంచుకోవడాలు అని పరిశీలకులు అంటున్నారు.

 

Tags: BJP alliance with Janasena party is love and hate