ఆయుష్మాన్ పై బీజేపీ కొండంత ఆశలు

BJP hopes on Ayushmann

BJP hopes on Ayushmann

Date:22/09/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఎన్నికలు సమీపిస్తోన్న తరుణాన నరేంద్ర మోదీ సర్కార్ ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని ప్రజల్లోకి తీసుకొస్తోంది. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే ఈ పథకాన్ని పీఎం జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)గానూ వ్యవహరించనున్నారు. పది కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూర్చే ఈ పథకం ఆదివారం ప్రారంభం కానుంది. ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించడం కోసం కేబినెట్ మంత్రులు తమ సొంత లేదా నియోజక వర్గాలు లేదా రాష్ట్రాలకు వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో పీఎంజేఏవైని ప్రారంభిస్తారు. ఏన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో సంబంధిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ వెళ్తుండగా.. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ పట్నాలో పీఎంజేఏవైని ప్రారంభిస్తారు.
లక్నోలో యూపీ గవర్నర్ రామ్ నాయక్‌తో కలిసి హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పథకానికి శ్రీకారం చుడతారు.ఈ పథకం ద్వారా యూపీ, బిహార్ రాష్ట్రాల ప్రజలకు ఎక్కువగా లబ్ధి చేకూరనుంది. ఉత్తర ప్రదేశ్‌లో 1.18 కోట్ల కుటుంబాలు, బిహార్లో 1.09 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ఆసరగా నిలవనుంది. యూపీలో 800కిపైగా ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఆదివారం నుంచి ఈ పథకం వర్తించనుంది.
బిహార్లో ఆదివారం నుంచి 350 ఆసుపత్రుల్లో ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు.ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎన్డీయే సర్కారు గేమ్ ఛేంజర్‌లా భావిస్తోంది. ఈ పథకం ద్వారా పది కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల వరకు నగదు రహిత వైద్యాన్ని అందించనున్నారు. ఘనంగా ఆరంభించడం ద్వారా లబ్ధిదారులకు ఈ పథకం పట్ల అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ‘ఆయుష్మాన్ భారత్’ పథకం వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు కురిపిస్తుందని మోదీ సర్కారు బలంగా విశ్వసిస్తోంది.
Tags:BJP hopes on Ayushmann

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *