వైసీపీ లోకి బీజేపీ నాయకురాలు పురందేశ్వరి 

BJP leader Purandeswari into the YCP
Date:12/01/2019
విజయవాడ ముచ్చట్లు:
2019లో ఏపీ ఎన్నికలు మరింత రక్తికట్టేలా ఉన్నాయి. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మరిన్ని ఆకర్షణ పథకాలతో టీడీపీ దూసుకుపోతుంటే, జగన్ పాదయాత్ర ఈసారికి తమకు అధికారం కట్టబెడుతుందని వైసీపీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. ఇక జనసేన పార్టీ అయితే 2019 ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తామని చెబుతోంది. ఇక ఆయా సమీకరణాల మధ్య ఏ పార్టీలో చేరితే భవిష్యత్ బాగుంటుందో అంచనా వేసుకుంటున్న నేతలు గోడలు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భాజపా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరనుండగా, మంత్రి భూమా అఖిలప్రియ సైతం జనసేనలో చేరనున్నారని వార్తలు రాగా ఆమె ఖండించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ప్రస్తుతం ఏపీలో బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోవడంతో ఆమె జగన్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్రతో హుషారుగా ఉన్న వైసీపీ.. మరింత మంది నేతలను చేర్చుకుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించొచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి రాకను జగన్ సైతం స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తన కుమారుడు హితేష్‌కు పర్చూరు అసెంబ్లీ సీటుతో పాటు తనకు గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీ టిక్కెట్ కావాలని ఆమె పట్టుబడుతున్నారట. కోరిన స్థానాలు ఇచ్చేందుకు జగన్ ఓకే చెబితే పురంధేశ్వరి ఈ నెల 21న వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పురంధేశ్వరి రాకతో రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కమ్మలను తమవైపు తిప్పుకోవచ్చని వైసీపీ భావిస్తోందట.
Tags:BJP leader Purandeswari into the YCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *