ఎన్నికల కోసం బీజేపీ  రూ.340 కోట్లు ఖర్చు

న్యూఢిల్లీ ముచ్చట్లు:


దేశంలో ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మిగిలిన పార్టీలతో పోల్చితే బీజేపీ ఎక్కువ డబ్బును ఖర్చు చేసింది. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ ఏకంగా రూ.340 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘంకి తెలిపింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మరో జాతీయ పార్టీ కాంగ్రెస్.. రూ.194 కోట్ల ఖర్చు చేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల వ్యయ నివేదికల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రాల వారీగా బీజేపీ చేసిన ఖర్చుల వివరాలను పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల కోసం ఎక్కువ ఖర్చు చేసింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసమే బీజేపీ రూ.221 కోట్లు ఖర్చు కోసింది. అంటే ఐదు రాష్ట్రాల కోసం చేసిన మొత్తం ఖర్చులో మూడింట రెండో వంతు యూపీలోనే ఖర్చు చేసింది కమలం పార్టీ. యూపీ తర్వాత ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎక్కువ ఖర్చు చేసింది. ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి రూ.43.67 కోట్లు ఖర్చు చేసింది.  పంజాబ్‌లో రూ.36 కోట్లు, మణిపూర్‌లో రూ.23 కోట్లు, గోవాలో రూ.19 కోట్ల డబ్బు ఖర్చు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ సమర్పించిన ఎన్నికల వ్యయ నివేదికలో తెలిపింది.

 

ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ రూ.194 కోట్లను ఖర్చు చేసినట్లు.. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో తెలిపింది. తృణముల్ కాంగ్రెస్ రూ.47.54 కోట్లు, ఆప్ రూ.11.32 కోట్లు వ్యయం చేసినట్లు ఈసీకి సమర్పించిన నివేదికల్లో ఆ పార్టీలు వెల్లడించాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఖర్చుల వివరాలను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆ నిబంధన మేరకు బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఇటీవల ఎన్నికల సంఘానికి తమ ఖర్చుల వివరాల నివేదికలు సమర్పించాయి. ఆ వివరాలను ఈసీ మీడియాకు వెల్లడించింది.ఈ ఏడాది ఫిబ్రవరి – మార్చి మాసాల్లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాయి.  పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయ విజయ ఢంకా మోగించింది. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కమలం పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని అధికార పీఠాలను దక్కించుకుంది. ఒక్క పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

 

Tags: BJP spent Rs.340 crores for elections

Leave A Reply

Your email address will not be published.