రాజధానిలో బీజేపీ పాదయాత్ర…
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతాపార్టీకి ఆగస్టు నాలుగోతేదీ మరపురాని రోజుగా నిలవనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదగా శంకుస్థాపన జరుపుకున్న నూతన రాజధాని అమరావతి కోసం ఆ పార్టీ నేతలు పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. నాలుగోతేదీన తుళ్లూరులో బహిరంగసభ నిర్వహించడంద్వారా యాత్ర ముగియనుంది. పాదయాత్ర ద్వారా బీజేపీ అనుకున్న రాజకీయ లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది ఆ పార్టీ నేతలే స్పష్టం చేయాల్సి ఉంది. దేశంలో ప్రధానమంత్రి చేతులమీదగా శంకుస్థాపనలు జరుపుకున్న ప్రాజెక్టులేవీ ఆలస్యమవలేదు. అమరావతి నిర్మాణం ప్రారంభమైన తర్వాత కొంతకాలానికి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది. ఆ ప్రభావం రాజధానిపై పడింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలై వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ మూడురాజధానుల ప్రకటన చేయడంతో ఇక్కడి రైతుల భవిష్యత్తు సందిగ్ధంలో పడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. అమరావతి నిర్మాణంలో పురోగతి లేకపోవడంతో దాదాపు వెయ్యిరోజుల నుంచి ఇక్కడి రైతులు ఉద్యమబాట పట్టారు. బీజేపీ నాయకులు రైతుల శిబిరాలను సందర్శించి మద్దతు ప్రకటించడం మినహా ఎటువంటి ప్రయోజనాన్ని వారికి కల్పించలేకపోయారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా తన మిత్రపక్షం జనసేనను కలుపుకోకుండానే పాదయాత్ర ప్రారంభించారు.
రాజధానిగా అమరావతే ఉంటుందని, తాము అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సర సమయంలోనే నిర్మాణాన్ని పూర్తిచేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అధికారం చేపట్టగల సామర్థ్యం బీజేపీకి ఏపీలో ఉందా? అంటే లేదా? అన్న విషయం వారికే తెలియాలి. రైతులు అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్న బీజేపీ నేతలు పాదయాత్ర ద్వారా అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళతారా? అక్కడే ఉంచుతారా? అనేది వారికే తెలియాల్సి ఉంది. మిత్రపక్షం లేకుండానే కార్యక్రమాలు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రైతులు జరిపిన 45 రోజుల మహా పాదయాత్రతోనే ఇక్కడి బీజేపీ నాయకుల్లో కదలిక వచ్చింది. అమిత్ షా ఆదేశాలతో పాదయాత్రలో పాల్గొని మద్దతు ప్రకటించారు. తర్వాత స్పందన లేదు. మళ్లీ ఇన్నాళ్లకు పాదయాత్ర చేశారు. రాష్ట్రంలోని పార్టీలకన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీపైనే అమరావతికి సంబంధించిన బృహత్తర బాధ్యత ఉందనే విషయం తెలుసు. కానీ అందుకు తగ్గ నమ్మకాన్ని మాత్రం వారు రైతుల్లో కల్పించలేకపోయారు. బీజేపీ రాజకీయ లక్ష్యం ఏమిటి? అమరావతిపై కేంద్రానికి ఎటువంటి నివేదిక ఇవ్వబోతోంది? అమరావతిపై ఢిల్లీ పెద్దలద్వారా ప్రకటన ఏమైనా చేస్తారా? తదితర విషయాలపై తుళ్లూరులో సభ ముగిసిన తర్వాతే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags: BJP’s march in the capital