బెంగాల్లో బీజేపీ మండ్ గేమ్
కోల్ కత్తా ముచ్చట్లు
పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ చాలా గట్టి ప్రయత్నాలే చేసింది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోం మంత్రి అమిత్ షా, సారధ్యంలో బీజేపీ శక్తి యుక్తులన్నీ ప్రయోగించి పోరాడింది. అయినా ఫలితం దక్కలేదు. రెండు వందల పైచిలుకు స్థానాలు లక్ష్యంగా అమిత్ షా పావులు కదిపినా, బీజేపీ నంబర్స్ రెండంకెల సఖ్యను దాటలేదు.మూడింట రెండు వంతుల మెజారిటీతో తృణమూల్ కాంగ్రెస్, ముచ్చటగా మూడవసారి విజయ కేతనం ఎగరేసింది. మమతా బెనర్జీ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. మరో వంక బీజేపీ అధికారం అందుకోలేక పోయినా, కేవలం నాలుగు స్థానాల నుంచి 70కి పైగా స్థానాలుకు సంఖ్యా బలాన్ని పెంచుకుంది. కాంగ్రెస్,వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా పూర్తిగా తుడిచి పెట్టుకు పోవడంతో తృణమూల్ కు ఏకైక ప్రతిపక్షంగా కమల దళం నిలిచింది. అసెంబ్లీలో లోపల వెలుపల కూడా తృణమూల్ కు ఏకైక ప్రత్యర్హ్దిగా బీజేపీ నిలిచింది. అదలా ఉంటే, ఇటీవల మహారాష్టలో విజయవంతంగా శివసేన అధినేత, ఉద్ధవ్ థాకరే సారధ్యంలో, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చిన కమల దళం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్’లో అదే తరహ ఆట మొదలు పెట్టిందని అంటున్నారు.నిజమే, మహారాష్ట్రలో ఎంవీఎ ప్రభుత్వాన్ని పడగొట్టినంత తేలిగ్గా బెంగాల్ ప్రభుత్వాన్ని పడగొట్టడం అయ్యే పని కాదు. 294 మంది సభ్యులున్న సభలో తృణమూల్ కాంగ్రెస్’ కు 220 కి పైగా స్థానాలున్నాయి. బీజేపీ టికెట్’పై గెలిచిన ఎమ్మెల్యేలలోనూ నలుగురైడుగురు తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు.అయినా బీజేపీ బెంగాల్లో, ‘మహా’ క్రీడకు శ్రీకారం చుట్టిందా అంటే, అవుననే సమాధానమే వస్తోంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, సినిమ హీరో, బీజేపీ నేత, మిథున్ చక్రవర్తి చేసిన సంచలన వ్యాఖ్యలు, అదే సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ వంక ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ అరెస్టైన సమయంలోనే బీజేపీ ముఖ్యనాయకుడు ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్థా కేసులో తృణమూల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వత్తిడి ఎదుర్కుంటున్నారు.కుప్పలుగా పోసిన నోట్ల కట్టలు బయట పడడంతో, సామాన్య ప్రజల్లో తృణమూల్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయికి చేరిందో, ప్రత్యక్షంగా చూస్తున్నారు. ట్రక్కులలో తరలిస్తున్న నోట్ల కట్టలు తృణమూల్ నాయకత్వాన్ని డిఫెన్సులోకి నెట్టి వేశాయి. ఇదలా ఉంటే పార్థా కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కుప్పలుగా పోసిన నోట్ల కట్టలతో పాటుగా, రాసులుగా పోసిన బంగారు ఆభరణాలు కూడా బయట పడుతున్నాయి. మరో వంక ఈడీ ఇప్పటికే పార్థా ఛటర్జీ, ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ఇంట్లో ఈడీ జరిపిన తొలి సోదాల్లో రూ. 21.90 కోట్ల నగదు, రూ. 56 లక్షల విదేశీ కరెన్సీ, రూ. 76 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేస్కున్నామని ఈడీ అధికారికంగా ప్రకటించింది. ఆ సొమ్ము సొమ్ము మంత్రి పార్థ ఛటర్జీకి చెందినదేనని విచారణలో అర్పిత ఈడీ అధికారులకు తెలిపారు. కాగా, పార్థా చటర్జీ అర్పిత ముఖర్జీకి చెందిన మరో ప్లాట్ లో ఈడీ నిర్వహించిన తాజా సోదాలలో కూడా భారీగా నగదు, బంగారం పట్టుబడింది.పలు కీలక డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండో సారి పట్టుబడిన సొమ్ము కూడా కొలువుల కుంభకోణానికి సంబంధించిన సొమ్మేనని అనుమానిస్తున్నారు. అదలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, సమయం చూసి, బెంగాల్లో ‘మహా’ క్రీడకు బీజేపీ మైండ్ గేమ్’కు శ్రీకారం చుట్టిందని అయితే చెప్పవచ్చని పరిశీలకులు అంటున్నారు.
Tags:BJP’s mind game in Bengal…