విజయేంద్రప్రసాద్ తో  బీజేపీ నయా స్కెచ్

హైదరాబాద్ ముచ్చట్లు:


రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో ఆర్ఎస్ఎస్ పై సినిమా, వెబ్ సిరీస్ తీయబోతున్నట్లు ప్రకటించారు ఆర్ఎస్ఎస్ జాతీయ సమైక్య సభ్యుడు రామ్ మాధవ్ రచించిన ‘ది హిందుత్వ పారాడిగ్మ్’ పుస్తక ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ కీలక కామెంట్స్ చేశారు. గతంలో తనకు ఆర్ఎస్ఎస్ పై ఉన్న అవగాహన వేరని అయితే ఈ సంస్థపై సినిమా కథను అందించాలని కోరడంతో తాను నాగపూర్ వెళ్లి ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించానని చెప్పారు. అక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిశానని, ఆ తర్వాత ఈ సంస్థపై తనకు ఉన్న అభిప్రాయం తప్పని తెలుసుకున్నానన్నారు.స్వయం సేవక్ సంఘ్ అంటే ఏంటో తనకు అక్కడ అర్థం అయిందని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు,

 

 

 

శిక్షణ తనను ఆకర్షించాయని చెప్పారు. ఇంత గొప్ప సంస్థ గురించి ఇన్నాళ్లు తెలియకుండా నేను ఉన్నానా అని పశ్చాతపడ్డానన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు బహిరంగంగా చెబుతున్నాన్నారు. ఆర్ఎస్ఎస్ లేకుంటే కశ్మీర్ లేదని దేశంలోని అనేక సమస్యలపై ఆర్ఎస్ఎస్ ముందుండి పోరాటం చేస్తోందన్నారు. కశ్మీర్‌ ప్రాంత హిందువులపై మారణహోమాలను ఆపగలిగింది కూడా ఆర్ఎస్ఎస్‌‌ అని విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. త్వరలోనే ఈ సంస్థపై సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీయబోతున్నట్లు ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. అలాగే తాను సాధించిన విజయాల గురించి ప్రచారం చేసుకోలేక ఆర్ఎస్ఎస్ గతంలో తప్పు చేసిందని ప్రస్తుతం కూడా ఇదే తప్పు చేస్తోందని అన్నారు.ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్‌, భజరంగి భాయిజాన్ వంటి సినిమాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్‌ తాజా ప్రకటనతో సినీ రాజకీయ ప్రముఖుల్లో ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ సీనియర్ రచయిత, స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రిగా గుర్తింపును తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ సినిమాలకు ఎలాంటి కథలను అందిస్తాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ తెలంగాణ బీజేపీ రజాకార్ ఫైల్స్ పేరుతో ఓ సినిమాను తీయబోతున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో ప్రకటించారు.

 

 

 

ఈ క్రమంలో విజయేంద్ర ప్రసాద్‌ను బీజేపీ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపిక చేసింది. ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్‌ను బండి సంజయ్, తరుణ్ ఛుగ్‌లు కలిసి శుభాకాంక్షలు చెప్పడం ఆ సమయంలో రజాకార్ ఫైల్స్ స్టోరీపై చర్చ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఓ వైపు రజాకార్ ఫైల్స్ పై కథను సిద్ధం చేస్తూనే మరో వైపు ఆర్ఎస్ఎస్ పై సినిమా, వెబ్ సిరీస్ తీయబోతున్నట్లు ప్రకటించడంతో ఈ స్టోరీలు ఎలా ఉంటాయో అన్న అంశం తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారింది.విజయేంద్ర ప్రసాద్ ప్రకటనపై విమర్శలు కూడా వస్తున్నాయి. రాజకీయంగా అతడికి రాజ్యసభ పదివిని కట్టబెట్టడం వల్ల బీజేపీకి అనుకూలంగా కథలు సిద్ధం చేస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనను పెద్దల సభకు పంపిన బీజేపీ రుణం తీర్చుకునే పనిలో భాగంగానే ఆయన ఇలాంటి కథలను అందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దేశంలో బీజేపీ తన భావ జాలాన్ని ప్రచారం చేసుకోవడానికి సినీ రంగాన్ని వాడుకుంటోందని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో ఓ సారి కామెంట్ చేయగా అది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఉరి, సర్జికల్ స్ట్రైక్, కశ్మీర్ ఫైల్స్ తో పాటు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ కూడా ఇదే కోవకు చెందిన సినిమాలుగా కేటీఆర్ అభివర్ణించాడు. భవిష్యత్ లోనూ ఇలాంటి సినిమాలు బీజేపీ భావజాల వ్యాప్తి కోసం వస్తాయని అన్నారు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఆర్ఎస్ఎస్ కోసం కథను సిద్ధం చేస్తున్నానని ప్రకటించడంతో కేటీఆర్ కామెంట్స్ పై మరోసారి చర్చ జరుగుతోంది.

 

Tags: BJP’s new sketch with Vijayendra Prasad

Leave A Reply

Your email address will not be published.